హైదరాబాద్, వెలుగు: ఇండియాలో టాప్ అమెచ్యూర్ గోల్ఫర్ల కోసం హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు టీ గోల్ఫ్ ఫౌండేషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్– కంట్రీ క్లబ్‌లో ఈ టోర్నీ జరగుతుందని తెలిపింది. ఈ మెగా ఈవెంట్ పోస్టర్‌ను టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ ఎన్.ఆర్.ఎన్. రెడ్డి, ఎమ్మార్ ఇండియా బిజినెస్ హెడ్ మధుసూదన్ రావు, బౌల్డర్ హిల్స్ జనరల్ మేనేజర్ పాపి రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. దేశ నలుమూలల నుంచి టాప్ అమెచ్యూర్ గోల్ఫర్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. గోల్ఫర్లు టోర్నీ అధికారిక పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
