విద్యార్థినుల ఆందోళనపై దిగొచ్చిన మహిళా వర్సిటీ..మెస్ ఇన్చార్జ్ వినోద్ సస్పెన్షన్

విద్యార్థినుల ఆందోళనపై దిగొచ్చిన మహిళా వర్సిటీ..మెస్ ఇన్చార్జ్  వినోద్ సస్పెన్షన్
  •      వర్కింగ్​ డేస్​లో షూటింగ్​లపై స్టూడెంట్స్​ అభ్యంతరం
  •      సెలవు రోజుల్లోనే అనుమతి ఇస్తామన్న ప్రిన్సిపాల్

బషీర్​బాగ్, వెలుగు: విద్యార్థినుల ఆందోళనపై కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ యాజమాన్యం దిగివచ్చింది. ఓయూ హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలంటూ వీసీ చాంబర్ ముందు మంగళవారం పెద్దఎత్తున పీజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. 

వర్సిటీలో తమకు భద్రత లేదంటూ వీసీ సూర్య ధనుంజయ, ప్రిన్సిపాల్ లోక పావనికి బాధలు వివరించారు. సినిమా షూటింగ్​ల కోసం బ్రిటిష్ రెసిడెన్సీని రెంట్​కు ఇవ్వడంతో ప్రైవేట్ సెక్యూరిటీ మద్యం సేవించి వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఇద్దరు విద్యార్థినులను యాక్టింగ్ అవకాశం ఇస్తామంటూ యూనిట్ సభ్యులు మద్యం సేవించి వేధించారని, శివకార్తికేయన్, శ్రీలీల నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమా షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించారన్నారు. 

హీరోయిన్ పక్కన సైడ్ క్యారెక్టర్ ఇస్తామంటూ నమ్మించారని వెల్లడించారు. మెస్ ఇంచార్జ్ వినోద్​కు మద్దతుగా తోటి సిబ్బంది సైతం ఒత్తిడి చేస్తున్నారని, ఈ ఘటనపై తొలుత వీసీ, ప్రిన్సిపాల్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో షీ టీమ్స్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. తమ తల్లిదండ్రులు నమ్మకంతో చదివిస్తున్నారని, స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం కల్పించాలని కోరారు. దీంతో వినోద్ సస్పెండ్​తో పాటు షూటింగ్​లను సెలవు రోజుల్లో మాత్రమే అనుమతిస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని చెప్పడంతో ఆందోళన 
విరమించారు.