- పని చేయని వాళ్లను ఉపేక్షించం
- జీహెచ్ఎంసీ మేయర్ పీఠం లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మేయర్ పీఠమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలో గ్రూపు తగాదాలు, కుమ్ములాటలు ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల పెంపు తదితర అంశాలపై మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో శివారు ప్రాంతాల ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడారు. ‘‘మనమంతా రాజకీయ కార్యకర్తలమనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మారుతున్న కాలానికి, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనమూ మారాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.
గొడవలు పెట్టుకుంటే పార్టీ సీరియస్‌గా తీసుకుంటది. కష్టపడి పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తది. వెంటనే అందరూ క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టాలి’’అని కార్యకర్తలను రాంచందర్ రావు ఆదేశించారు. స్థానిక సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలను మనవైపు తిప్పుకోవాలన్నారు. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలని, అందుకు తగ్గట్టుగా కేడర్ సిద్ధం కావాలని తెలిపారు.
అభివృద్ధి లేదు.. పన్నుల బాదుడే..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విలీన ప్రక్రియను బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ‘‘హైదరాబాద్ సిటీలో చిన్న వర్షం పడితే కాలనీలు మునుగుతున్నాయి. డ్రైనేజీలు పొంగుతున్నాయి. ఉన్నవాటిని బాగుచేయడం లేదు. కొత్తగా పక్కన ఉన్న మున్సిపాలిటీలను కలుపుతామనడం విడ్డూరం. కేవలం తమ మిత్రపక్షమైన ఎంఐఎంను సంతోషపెట్టేందుకే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది’’అని రాంచందర్ రావు ఆరోపించారు.
విలీనం పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, దీనికి వ్యతిరేకంగా బాధిత ప్రాంతాల ప్రజలతో కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
