తెలంగాణలో క్రియాశీల ప్రతిపక్ష పాత్ర పోషించమని రెండేళ్ల కింద ప్రజలు పురమాయించినా.. బీఆర్‌ఎస్ ప్రజల ఆకాంక్షల మేరకు నిలవలేకపోతోంది.విపక్షంగా రోజురోజుకూ ఎదగాల్సిందిపోయి పతనం నుంచి పతనానికి జారుతున్నట్టు వారి సంస్థాగత డొల్లతనమే వెల్లడిస్తోంది. పార్టీ కిందిస్థాయి కార్యకర్తలు, నాయకశ్రేణి తమ మనుగడ కోసం, ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉనికి చాటు కోసం యత్నిస్తున్న పోరాటం, ఆరాటమే తప్ప నాయకత్వ దిశానిర్దేశం, వ్యూహరచన పూజ్యం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్కిన ‘సున్నా’ తర్వాత, చేతిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్ని ‘చే’జార్చుకొని బీఆర్‌ఎస్ మసకబారింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే వైఖరి, చర్యలు లేకుంటే మరింత బలహీనపడటం ఖాయం. ఇది... అటు కేంద్ర పాలకపక్షం బీజేపీని రాష్ట్రంలో పెంచడానికో, ఇటు రాష్ట్ర పాలకపక్షం కాంగ్రెస్ ప్రజల అసంతృప్తిని తనకు వ్యతిరేకతగా మారనీయకుండా నిలువరించుకునే ‘స్టేటస్‌కో’కో పనికివస్తుందే తప్ప బీఆర్‌ఎస్‌కు మాత్రం నికరనష్టమే!
నేర్చుకుంటే ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు బీఆర్‌ఎస్ నాయకత్వానికి ఒక చక్కని పాఠమే! గ్రామీణస్థాయి కార్యకర్తలు, -నేతల స్వీయ రాజకీయ మనుగడ కోసమో, ఊర్లల్లో ఉండే ద్విధృవ రాజకీయాల వల్లో, మరే బలమైన కారణమో... గ్రామాల్లో బీఆర్‌ఎస్ పాలకపక్షమైన కాంగ్రెస్‌కు గట్టి పోటీనే ఇచ్చిందని సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టమైంది. ఇది నాయకత్వ ప్రతిభ కానేకాదని పార్టీ శ్రేణులు బల్లగుద్ది చెబుతాయి. నిజానికి ఇంకా ఎంతో సాధించాల్సింది, కానీ, ఇంతటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నది వారి భావన! రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేళ్ల పాలన ముగిసి, అధికారం చేజారి రెండేళ్లవుతున్నా... ఆశించినస్థాయిలో పార్టీ కోలుకోలేకపోతోందన్నది వారి బాధ! రాష్ట్రవ్యాప్తంగా జనాల్ని కదిలించిన ఒక్క కార్యక్రమం కూడా లేదనే విమర్శ స్వపక్షంలోనే ఉంది. సోషల్ మీడియా, - సంప్రదాయ మీడియాలో మనుగడ తప్ప ప్రజాక్షేత్రంలో పార్టీ రోజుకింత మసకబారటం శ్రేణుల్ని కలతకు గురిచేస్తోంది.
సంస్థాగత మార్పులేదు
పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు పరిమితమైతే, ఇతర ముఖ్య నాయకులు విల్లాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని సొంత పార్టీవారే గొణుక్కుంటున్నారు. రద్దయిన జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాలు, వాటి వివిధ స్థాయి కమిటీలు ఏవీ మళ్లీ ఏర్పడలేదు. అందుకే నిర్ణయాలన్నీ కేంద్రీకృతమే! ఏదైనా కీలక అంశంపై మీడియా సమావేశం పెట్టాలన్నా పెద్దల అనుమతి రావాల్సిందే! రెండేళ్లవుతున్నా పార్టీ శాసనసభాపక్ష కార్యవర్గమే ఏర్పడలేదు. ప్రతినిధులు బీఏసీ వంటి భేటీలకు వెళ్తే ‘మీరు ఏ హోదాతో వస్తున్నారు?’ అనే పాలకపక్ష సభ్యుల ఎకసక్కాలు వారికి తప్పట్లేదు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించడానికి కిందిస్థాయి కార్యకర్తలు కష్టపడాలి. కానీ, వారికి నాయకత్వ స్థానాలు, పదవులు దక్కే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రం సదరు బడా నాయకులు కష్టపడకపోవడం కార్యకర్తలకు కళ్లకు కడుతోంది.
తోటకూర నాడే..
ఉద్యమ కాలంలో ఏ అలకలనైనా, అలసత్వాన్నయినా సహించిన ప్రజలు, ‘ఫక్తు రాజకీయ పార్టీ’ అయ్యాక నిర్లక్ష్యాల్ని క్షమించమంటే అంగీకరించరు. ప్రజలు సమస్యల్లో ఉన్నపుడు, వారికి దన్నుగా ప్రజాక్షేత్రంలోకి రాకుండా, ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టకుండా ఎన్ని ప్రకటనలు చేసినా జనానికి నచ్చదు. అదీ ప్రతిపక్షంలో ఉన్నపుడు! విపక్ష రాజకీయ కార్యాచరణ ‘మూడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు-.. ఆరు ట్వీట్లు’గా వర్ధిల్లితే చాలనుకుంటే అది తప్పుడు అంచనాయే! 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే బీఆర్‌ఎస్ పతనం మొదలుకాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల వెంటనే సంకేతాలు మొదలయ్యాయి. ఆరు మాసాల్లోపే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటు వాటా రమారమి 5 శాతం తగ్గింది. ఎంపీ స్థానాలు తగ్గాయి. అప్పటిదాకా బీఆర్‌ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాలు బీజేపీకి పోయాయి. స్వయానా కేసీఆర్ తనయ కవిత నిజామాబాద్‌లో ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన హుజూరాబాద్ (కరీంనగర్ జిల్లా), దుబ్బాక (సిద్దిపేట- గజ్వేల్‌కు ఆనుకొని ఉన్న) ఉప ఎన్నికల్లో ఓటమి, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో భంగపాటు సంస్థాగత దిద్దుబాట్ల అవసరానికి స్పష్టమైన సంకేతాలే! ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ దక్కలేదు. కానీ, నాయకత్వం ఇవేవీ పెద్దగా పట్టించుకోలేదు. సంస్థాగత నిర్మాణంపై పుష్కరకాలంలో శ్రద్ధ పెట్టలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవంబరు 9వ తేదీ వరకు బీఆర్‌ఎస్ అనుకూల వాతావరణమే ఉండింది. కాంగ్రెస్‌లో మొదట్నుంచీ అభ్యర్థిత్వంతో సహా పోటీ వాతావరణమే ఉంది. నియోజకవర్గం బయటి నుంచి వచ్చిన నాయకులు వెళ్లిపోయాక అక్కడ బీఆర్‌ఎస్ పార్టీ చతికిలపడింది. ఫలితం వెక్కిరించింది.
పట్టున్న చోట నిలుపుకోలేదు,
పట్టు లేనిచోట సాధించలేదు.
2001లో ఏర్పడ్డనాటి నుంచి ఎన్నికలు, ఉప ఎన్నికలంటే వెరుపు లేకుండా గెలుపే లక్ష్యంగా సాగిన పార్టీ.. టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయక తప్పిదం చేసింది. బీఆర్‌ఎస్ కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ 2019 నుంచి క్రమంగా అది బీజేపీవైపు జారిపోతున్నా జాగ్రత్తపడలేదు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలతోపాటు స్థానిక సంస్థల్లోనూ కాషాయ పార్టీ పాగా వేస్తున్న ధోరణి సుస్పష్టం. ఇక దక్షిణ తెలంగాణ, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌కు గట్టిపోటీయే! పాతికేళ్లయినా ఖమ్మం జిల్లాలో ఒకటి, రెండు స్థానాలకు మించి పార్టీ బలపడటం లేదు. ఈ రెండు జిల్లాల్లో కమ్యూనిస్టులు బలహీనపడ్డ శూన్యంలోకైనా బీఆర్‌ఎస్ విస్తరించలేకపోతోంది. ఈ నెల 21న జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ భవిష్యత్ కోసం, బలోపేతం కోసం నిజాయితీతో కూడిన లోతైన సమీక్ష జరగాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు కోరుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికైనా, జనంలోకి వెళ్లాలనే తలంపుతో చేసే
పాదయాత్ర ఆలోచనల్ని ప్రజలు స్వాగతిస్తారు. పార్టీలో తిరుగుబాటు చేసిన కల్వకుంట్ల కవిత ప్రచారం పార్టీని ఇరకాటంలో పెడుతోంది.
కేసీఆర్ భయ-సందేహాలు వీడితేనే...
బీఆర్‌ఎస్‌లో వివిధస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసినా, బలహీనపరచినా అది కేసీఆర్ చేతిలో పని. 2023 అసెంబ్లీ ఎన్నికలముందు ‘పాతిక, ముఫ్ఫై మంది విఫల ఎమ్మెల్యేలున్నారు, వారిని మారుస్తాను’ అని ప్రకటించి కూడా ఆయన మార్చలేదు. మారిస్తే వారు తిరగబడి పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తారని ఆయన జంకినట్టున్నారు. అదే తప్పయింది. టికెట్లు మార్చిన చోట కొన్ని పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి. జాతీయ రాజకీయాలంటూ ఎన్నికల ముందు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల వెంటపడి తిరగటం ప్రతికూల ఫలితాలిచ్చింది. టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్, పార్టీ పేరు మార్పిడితో సహా అలాంటి పలుచర్యల వల్ల... ఉద్యమ పార్టీకున్న ‘తెలంగాణ’ పేగుబంధం బలహీనపడింది . పేరుపై పునరాలోచనకు పార్టీలో డిమాండ్ ఉంది. ఉద్యమకాలంలో, ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో కేసీఆర్ ప్రతి కీలక అంశంపైన ఆంతరంగికంగానైనా విస్తృత సంప్రదింపులు జరిపి, లోతుగా చర్చ చేసేవారు. అది, ఆయన ఆలోచనలకు మరింత వన్నె తెచ్చేది. రానురాను అది పూర్తిగా కనుమరుగై ప్రజలతో, ప్రజాభిప్రాయాలతో ఆయనకు సంబంధమే తెగిపోయింది. ఈ పరిణామ ప్రభావం, పార్టీ రజతోత్సవ (వరంగల్) సభా వేదిక నుంచి ఆయన చేసిన ప్రసంగంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రత్యర్థుల్ని కూడా ప్రభావితుల్ని చేసే ‘కేసీఆర్ ప్రసంగ ధాటి’ ప్రభ తగ్గింది. ఇక పార్టీ ముఖ్య నాయకులు హరీష్‌రావు, కేటీఆర్ మధ్య అనారోగ్యకర స్పర్ధ ఉందని బీఆర్‌ఎస్ లోపల బయట సాగే ప్రచారం పార్టీ ఎదుగుదలకు అవరోధమవుతోంది. ఇది కేసీఆర్ తీర్చాల్సిన సమస్యే! కేసీఆర్ కూడా ఏదో ఒకటి నిర్ణయించాలి. ఏమైనా... కేసీఆర్ గుహ నుంచి బయటకు వచ్చి, భయ..సందేహాలు వీడి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం పార్టీ మనుగడకు ఎంతో అవసరం.
నిజాయితీ సమీక్ష కావాలి
ఆయుధాలు వీడి, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పోరాటాలకు మావోయిస్టులే సన్నద్ధమవుతున్నపుడు రాజకీయ పార్టీలో గెలుపోటములపై వాస్తవిక సమీక్ష వల్ల నష్టమేముంటుంది? ఓటమికి కారణాలేంటో ఇప్పటివరకు బీఆర్‌ఎస్ నిజాయితీగా సమీక్ష జరపలేదు. తమను ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజలే తప్పు చేశారని, వారే ఏదో రోజున నిజం గ్రహించి తిరిగి తమను గెలిపించుకోవాలనే అర్థం వచ్చేలా నాయకత్వం మాట్లాడుతూ వచ్చింది. ఇప్పటికీ అదే వాదన వినిపిస్తుంటారు. ‘అబద్ధాలతో కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదోవ పట్టించింది’ అంటే కొంతవరకు సహిస్తారేమో కానీ, తమను ఓడించి ప్రజలు తప్పు చేశారంటే ‘ప్రజాస్వామ్యం’ అంగీకరించదు. అది రాజకీయ పరిభాషే కాదు! బీఆర్‌ఎస్ తమ బలమేంటి, బలహీనతేంటి తెలుసుకోవాలి. ‘పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటున్నాం’ అంటున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అందుకు తగ్గ కార్యాచరణపై దృష్టి పెట్టాలి.
- దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
