కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో సౌకర్యాలపై తనిఖీలు చేపట్టనున్నారు. కాలేజీల్లో నిబంధనలకు అనుగుణంగా ల్యాబ్, లైబ్రరీ, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ తదితర కనీస వసతులు ఉన్నాయా లేవా అనే అంశాలను యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నాయి. కాగా యూనివర్సిటీలో కీలకమైన ఆఫీసర్ వద్ద పీఏగా పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల నుంచి వసూళ్లకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది.
నేటి నుంచి తనిఖీలు
యూనివర్సిటీ పరిధిలో సుమారు 70 ప్రైవేట్ డిగ్రీ, 25 ప్రైవేట్ పీజీ, 24 ప్రైవేట్ బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంసీఏ కాలేజీ, రెండు ప్రైవేట్ లా కాలేజీలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో కాలేజీ డెవలప్ మెంట్ కౌన్సిల్(సీడీసీ) నుంచి ప్రత్యేక బృందాలు ఏటా తనిఖీలు చేసి అఫ్లియేషన్ ను రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. ఈ తనిఖీల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. కాగా తనిఖీలకు వెళ్లడానికి ముందే ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి కాలేజీ యాజమాన్యాలతో ముందే బేరం మాట్లాడుకున్నట్లు తెలిసింది.
కాలేజీకి ఇంత రేట్ ఫిక్స్ చేసి.. తాము కాలేజీకి తనిఖీలకు వచ్చినప్పుడే ఆ అమౌంట్ ను ‘కవర్’ లో పెట్టివ్వాలని, అమౌంట్ ఇస్తే అంతా తానే కవర్ చేస్తానని హామీ ఇస్తున్నట్లు సమాచారం. ఒక్కో కాలేజీ నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫిక్స్ చేసినట్లు తెలిసింది. యూనివర్సిటీలో ఓ పెద్ద సార్ దగ్గర పనిచేసే వ్యక్తి కావడంతో యాజమాన్యాలు కూడా అందుకు అంగీకరిస్తున్నట్లు తెలిసింది. దీంతో శనివారం నుంచి జరగబోయే తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

