పార్కులు తెరవట్లే.. ఫౌంటేయిన్లు పనిచేస్తలే!

పార్కులు తెరవట్లే.. ఫౌంటేయిన్లు పనిచేస్తలే!
  • వరంగల్​లో రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా ఫాయిదా లేదు

వరంగల్‍, వెలుగు:  ఓరుగల్లులో నేషనల్‍ ఓపెన్‍ అథ్లెటిక్స్​చాంపియన్‍షిప్‍ స్పోర్ట్స్ ఫెస్టివల్‍ జరుగుతోంది. వివిధ రాష్ట్రాల ఆటగాళ్లతో పాటు కోచ్‍లు, టెక్నికల్‍ టీంలు చేరుకున్నాయి. పనిలో పనిగా వరంగల్‍ అందాలను చూడాలని వారంతా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వచ్చారు. తీరా చూస్తే.. వంద కోట్లు పెట్టి కట్టిన పార్కులకు తాళాలు వేశారు. సిటీ జంక్షన్లలోని వాటర్‍  ఫౌంటేయిన్లు పని చేయట్లేదు. రంగుల లైట్లు వెలగట్లేదు. అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసిన కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) వాటి నిర్వహణను అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అథ్లెటిక్స్​చాంపియన్‍షిప్‍ పోటీల ఏర్పాట్లు చూసే క్రమంలో రెగ్యులర్​గా హాజరవుతున్న కుడా చైర్మన్‍.. తన శాఖ పనులను మాత్రం గాలికి వదిలేశారనే విమర్శలు వినపడుతున్నాయి. 
ఎన్నికల టైంలో హడావిడిగా పనులు
గ్రేటర్ వరంగల్‍ ఎన్నికలకు ముందు గులాబీ లీడర్లు రూ.1,500 కోట్ల పనులకు  శ్రీకారం చుట్టారు.  హన్మకొండ అంబేద్కర్ జంక్షన్‍, కొత్త బస్టాండ్‍, ఫాతిమా నగర్‍, హంటర్‍రోడ్‍ హైవే బ్రిడ్జి,  ములుగు రోడ్‍  జంక్షన్ల ముస్తాబు పేరుతో గంటల టైంలో గార్డెనింగ్‍, ఫ్లోర్‍, గ్రిల్స్, బొమ్మలు, ఫౌంటేయిన్లు పెట్టేశారు. పనులు జరిగే విధానాన్ని గమనించిన సిటీ జనాలు అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావిడిగా చేసే పనుల్లో క్వాలిటీ ఉండదని చెప్పారు. లీడర్లు, కాంట్రాక్టర్లు, పనులు చూసే ఆఫీసర్లు మాత్రం ఇవేం పట్టించుకోకుండా క్వాలిటీ సర్టిఫికెట్‍ ఇచ్చేసుకున్నారు. వీటి ఓపెనింగ్‍ కోసం కేటీఆర్‍ ఈ ప్రదేశాలకు చేరుకోడానికి గంట ముందు పనులన్నీ మమ అనిపించారు.
కేటీఆర్ ఓపెన్‍ చేసిన పార్కులకు తాళాలు
వరంగల్‍ భద్రకాళి బండ్‍ గురించి మూడేళ్లుగా వార్తల్లో హైలైట్‍ చేశారు. మొదటి, రెండో విడతల్లో రూ.25 కోట్లు, రూ.65 కోట్ల చొప్పున రూ.90 కోట్లతో పనులు చేపట్టారు. మొదటి దశ కంప్లీట్‍ అవగానే గ్రేటర్‍ ఎలక్షన్‍ ముందు కేటీఆర్​తో చాలా ఆర్భాటంగా ఓపెనింగ్‍ చేయించారు. ఈ సందర్భంగా కేటీఆర్‍ మాట్లాడుతూ మొదట రాష్ట్రంతో పాటు దేశంలోని టూరిస్టులంతా భద్రకాళి బండ్‍ విజిట్‍ చేయాలని పిలుపునిచ్చారు. వీటితో పాటు రూ.1.4 కోట్లతో హన్మకొండ జైన మందిర్‍, సరిగమ పార్కులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ పార్కులన్నింటినీ చూడాలని కేటీఆర్‍ టూరిస్టులకు సజెస్ట్ చేస్తే.. కుడా అధికారులు మాత్రం వీటన్నింటికీ తాళాలు వేశారు. ఇవేం తెలియని పర్యాటకులు, లోకల్‍ జనాలు తీరా అక్కడికి వెళ్లాక తాళం చూసి డిసప్పాయింట్‍ అవుతున్నారు.
నేషనల్‍ ఫెస్టివల్‍ టైంలోనూ..
వరంగల్‍ సిటీలో నిర్వహిస్తున్న నేషనల్‍ అథ్లెటిక్‍ స్పోర్ట్స్ ఫెస్టివల్‍ను లీడర్లు, పోలీస్‍, స్పోర్ట్స్ తదితర శాఖలన్నీ చాలెంజ్‍ గా తీసుకున్నాయి. నెల ముందు నుంచే కావాల్సిన ఏర్పాట్లు చేశాయి. నిత్యం వీటన్నింటిని గమనిస్తున్న కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ మాత్రం తాను చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టడం లేదు. టూరిస్టులు వచ్చే క్రమంలో ఇక్కడి అందాలు చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉండగా పార్కులకు తాళాలు వేసింది. జంక్షన్లు, గార్డెన్లలోని ఫౌంటేయిన్ల పనితీరును పట్టించుకోలేదు. మొత్తంగా ఆహ్లాదం పేరుతో ఖర్చు చేసిన కోట్లాది రూపాయలకు అర్థం లేకుండా చేసింది.

ఒక్క జంక్షన్​లోనూ ఫౌంటేయిన్‍ పని చేయట్లే..
హన్మకొండ అంబేద్కర్‍ జంక్షన్‍, కేయూ జంక్షన్‍, కొత్త బస్టాండ్‍, సీఎస్సార్‍ గార్డెన్‍, ఫాతిమా నగర్ జంక్షన్ల డెవలప్‍మెంట్‍ పేరుతో రూ.4 కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు చేశారు. రంగురంగుల లైట్ల మధ్య ఫౌంటేయిన్లు పెట్టారు. ప్రతిరోజూ సాయంత్రం సిటీ జనాల ఆహ్లాదం కోసం వీటిని ఆన్‍ చేస్తామన్నారు. మామూలు రోజులు వదిలేస్తే.. కనీసం శని, ఆదివారాలు, పండుగలు, శ్రావణమాస సాయంత్రాలు, వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలోనూ ఇవి పనిచేయడం లేదు. 


క్వాలిటీ ఉండదని అప్పుడే చెప్పినం
ట్రైసిటీలోని జంక్షన్ అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడే క్వాలిటీ బాగాలేదని చెప్పాం. ఎలక్షన్లు, కేటీఆర్‍ టూర్‍ పేరుతో గంటలో గడ్డి పెట్టారు, పూల చెట్లు నాటారు. అప్పటికప్పుడు వాటర్ ఫౌంటేయిన్లు అమర్చారు. మేం చెప్పిందే నిజమైంది. ఏ జంక్షన్​లోనూ ఈవెనింగ్‍, ఫెస్టివల్‍ టైంలోనూ ఫౌంటేయిన్లు వాటర్ పోయడం లేదు. అనవసరంగా కోట్ల రూపాయలు వేస్ట్ చేశారు. 
                                                                                                                                                                                                                    - బంక సతీశ్, హన్మకొండ