ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో బాహుబలి తరహా పోరు

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో బాహుబలి తరహా పోరు
  • ఐదున్నర గంటలు  పోరాడి టైటిల్ కైవసం చేసుకున్న రఫెల్ నాదల్
  • తొలి 2 సెట్లు ఓడినా తర్వాత పుంజుకుని వరుసగా మూడు సెట్లలో గెలుపు 
  • 21 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన తొలి టెన్నిస్‌ ఆటగాడుగా రికార్డు

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ను స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. తొలి రెండు సెట్లు ఓడినా ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో అనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు సెట్లలో గెలిచి టైటిల్ చేజిక్కించుకున్నాడు. అంతేకాదు  21 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన తొలి టెన్నిస్‌ ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందెన్నడూ చూడని తరహాలో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. సుమారు ఐదున్నర గంటలపాటు జరిగిన పురుషుల సింగిల్స్  ఫైనల్ లో ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్‌ను మట్టి కరిపించాడు. 
ఐదు సెట్లలో హోరా హోరీ

ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ భీకరంగా సాగింది. బాహుబలి సినిమా ఫైటింగ్ దృశ్యాలను గుర్తు చేసేలా మెద్వదేవ్ తో తలపడిన రఫెల్ నాదల్ దెబ్బతిన్న బెబ్బులిలా విజృంభించాడు. ఓటమి అంచుల నుంచి బయటపడడమే కాదు.. మెద్వదేవ్ ను రఫ్పాడించి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ లో ముందు కొద్దిగా తడబడినట్లు కనిపించిన నాదల్ ఆరంభంలో వరుగా రెండు సెట్లు ఓడిపోయాడు. అయితే ఆ తరవాత అనూహ్యంగా పుంజకుని  వరుసగా రెండు సెట్లు గెలిచి... అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయిదో సెట్‌ తప్పనిసరి చేశాడు. మ్యాచ్ మలుపు తిరగడంతో ప్రేక్షకులంతా సీనియర్ రఫెల్ నాదల్ కు మద్దతు పలుకుతూ కేరింతలు కొట్టారు. దీంతో పుంజుకున్న నాదల్ చివరి సెట్‌ను 7 - 5తో గెలిచాడు. దాదాపు అయిదున్నర గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌ను 2 .. 6, 6 .. 7, 6 .. 4, 6 .. 4, 7 .. 5 స్కోరుతో మెద్వెదేవ్‌ను నాడల్‌ ఓడించాడు. ఓ వైపు వయసు మీద పడుతున్నా.. మరో వైపు గాయాలు ఇబ్బందిపెడుతున్నా.. కుర్రాళ్లతో పోటీ పడి ఒత్తిడిని జయించి విజేతగా నిలిచాడు నాదల్. 
ఆల్ టైమ్ గ్రేట్ గా నాదల్
ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న రఫెల్ నాదల్ టెన్నిస్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచాడు. ప్రపంచ టెన్నిస్ హిస్టరీలో ఇప్పటి వరకు రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ చెరో 20 టైటిళ్లు సాధించగా.. ఇప్పుడు వారిద్దరినీ నాదల్ వెనక్కు నెట్టేశాడు. నాదల్ కెరీర్ లో ఇది రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్. తొలిసారి 2009లో ఆస్ట్రేలియాలో టైటిల్ నెగ్గిన రఫెల్ నాదల్.. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు  విజేతగా నిలిచి జగజ్జేతగా అవతరించాడు. 

 

 

 

ఇవి కూడా చదవండి

పంతం నెగ్గించుకున్న కర్ణాటక రైతు.. ఇంటికే వెళ్లి వాహనం డెలివరీ

డబ్ల్యూహెచ్‌వోపై ప్రధాని మోడీకి తృణమూల్ ఎంపీ ఫిర్యాదు

GO 317పై ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్

కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు త్వరలో చరమగీతం