డబ్ల్యూహెచ్‌వోపై ప్రధాని మోడీకి తృణమూల్ ఎంపీ ఫిర్యాదు

డబ్ల్యూహెచ్‌వోపై ప్రధాని మోడీకి తృణమూల్ ఎంపీ ఫిర్యాదు

జమ్ము కశ్మీర్‌‌ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఘోర తప్పిదానికి పాల్పడింది. జమ్ము కశ్మీర్‌.. మన దేశంలో భాగం కాదన్నట్లుగా తన వెబ్‌సైట్‌లోని మ్యాప్‌లలో ప్రచురించింది. కొంత భాగం మన దేశంలో,  చైనా, పాకిస్థాన్‌లలో మరికొంత భాగం కశ్మీర్ ఉన్నట్లుగా చూపింది. ఇది తెలిసేలా ఇండియా మ్యాప్‌కు ఒక కలర్, జమ్ము కశ్మీర్‌‌లోని ఒక భాగానికి మరో కలర్ వేసింది. డబ్ల్యూహెచ్‌వో వెబ్‌సైట్‌లో ఉన్న ఆ మ్యాప్‌లో కశ్మీర్ ప్రాంత పై భాగంలో కర్సర్‌‌ను ఉంచితే పాకిస్థాన్‌ అని డిస్‌ప్లే వస్తోంది. కింది భాగంలో ఇండియా అని వస్తుండగా.. ఆక్సాయ్ చిన్‌ ప్రాంతంలో అడ్డుగీతలు గీచి వేరొక కలర్‌‌ ఉంచింది డబ్ల్యూహెచ్‌వో.  ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులపై వివరాలు తెలిపేందుకు డబ్ల్యూహెచ్‌వో వెబ్‌సైట్‌లో పెట్టిన మ్యాప్‌లలో చేసిన ఈ తప్పిదాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ శంతను సేన్ గుర్తించారు. పై విషయాలన్నీ వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఇవాళ లేఖ రాశారు. అంతేకాదు అరుణాచల్‌ ప్రదేశ్‌ను మన మ్యాప్‌లోనే ఉంచినప్పటికీ మధ్యలో సన్నని గీత ఒకటి గీసినట్లు శంతను సేన్ వివరించారు.

సీరియస్ ఇష్యూ.. దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలె

డబ్ల్యూహెచ్‌వో.. ఇండియా మ్యాప్‌ విషయంలో తన ఇష్టానుసారం వ్యవహరించడం చాలా సీరియస్ ఇష్యూ అని ఎంపీ శంతను తన లేఖలో పేర్కొన్నారు. ఇది సీరియస్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని, మన ప్రభుత్వం ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించి ఉండాల్సిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఒక సంస్థ వెబ్‌సైట్‌లో ఇలా జరగడం చాలా తీవ్రమైన విషయమని, దీనిపై తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నాళ్లు ఇంత పెద్ద తప్పును ఎలా గుర్తించలేకపోయారన్నది దేశ ప్రజలందరికీ వివరణ ఇవ్వాలని ఎంపీ శంతను డిమాండ్ చేశారు.