న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో మొత్తం వాటాను అమ్మేయాలని ప్లాన్ చేస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్‌బీడీ, ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ ఈ బ్యాంక్‌లో 61శాతం వాటాను కొనుగోలు చేసేందుకు త్వరలో ఫైనల్ బిడ్లను సమర్పిస్తాయని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐలో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిపి 90శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రభుత్వం తన 30.48శాతం వాటాను అమ్మనుండగా, రూ.33 వేల కోట్లు సేకరించాలని చూస్తోంది. మరోవైపు ఎల్‌ఐసీ 30.24శాతం వాటాను విక్రయించనుంది.
అర్హత పొందిన సంస్థలు ఫైనల్ బిడ్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత ఇంటర్ మినిస్టీయల్ గ్రూప్ (ఐఎంజీ) సమీక్షించి ఆమోదం కోసం ఆర్థిక మంత్రికి పంపుతుంది. మొత్తం ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్‌లోపే పూర్తవుతుందని అధికారులు చెప్పారు. ఐడీబీఐలో వాటాలు అమ్మకంపై 2020 బడ్జెట్‌లో మొదట ప్రతిపాదించారు. 2022లో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌పీఎఫ్) జారీతో డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ముందుకొచ్చింది. ఆర్‌బీఐ ఇప్పటికే నాలుగు బిడ్డర్లకు క్లియరెన్స్ ఇచ్చింది. 2025లో డ్యూ డిలిజెన్స్ పూర్తి కాగా, ఇప్పుడు ఫైనల్బిడ్లను ఆహ్వానిస్తున్నారు.
