సంప్రదాయ విత్తనాలను కాపాడుకోవాలి.. రంగారెడ్డి జిల్లా అన్మాసుపల్లిలో రెండో విత్తనపండుగ షురూ

సంప్రదాయ విత్తనాలను కాపాడుకోవాలి.. రంగారెడ్డి జిల్లా అన్మాసుపల్లిలో రెండో విత్తనపండుగ షురూ
  • రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పిలుపు

హైదరాబాద్, వెలుగు : అంతరించిపోతున్న దేశీయ సంప్రదాయ విత్తనాలను రక్షించుకోవాలని రాష్ట్ర రైతు కమిషన్‌‌ చైర్మన్‌‌ కోదండరెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లిలోని ఎర్త్‌‌ సెంటర్‌‌లో సెంటర్ ఫర్ గ్రీన్‌‌ రెవల్యూషన్ (సీజీఆర్), భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండో విత్తన పండుగకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ... వేల కోట్లు సంపాదిస్తున్న మల్టీ నేషనల్‌‌ కంపెనీలు ఐటీ, మార్కెట్‌‌ ఫీజు మినహాయింపులు పొందుతున్నాయన్నారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు.

విత్తనాలను కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లోంచి రైతుల ఆధీనంలోకి తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. హైబ్రిడ్‌‌ విత్తన వ్యాపారంతో మల్టీ నేషనల్‌‌ కంపెనీలు ప్రభుత్వాలను శాసిస్తున్నాయన్నారు. వనరులు, అవకాశాలు ఉన్నా సంప్రదాయ విత్తనాలను పండించడం లేదని, ఇప్పటికైనా మేల్కొనకపోతే వాతావరణ మార్పులకు తోడు కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  

సీజీఆర్‌‌ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆహారంలోనే ఆరోగ్యం ఉందని, కానీ ప్రస్తుతం కల్తీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరాల కోసం సంప్రదాయ విత్తనాలను రక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు స్టాల్స్‌‌ను పరిశీలించారు.

కార్యక్రమంలో సీజీఆర్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ మాజీ కమిషనర్‌‌ దిలీప్‌‌రెడ్డి, కార్యక్రమ కన్వీనర్‌‌,  పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి, రైతు కమిషన్‌‌ సభ్యుడు గోపాల్‌‌రెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, నాబార్డ్ సీజీఎం ఉదయ్‌‌భాస్కర్‌‌, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌‌రెడ్డి, భారత్‌‌ బీజ్ స్వరాజ్‌‌ మంచ్ కన్వీనర్ జాకోబ్, ఫారెస్ట్‌‌ ఆఫీసర్‌‌ రోహిత్ పాల్గొన్నారు.  అనంతరం ‘పుడమి’ పత్రికను ఆవిష్కరించారు.