పంతం నెగ్గించుకున్న కర్ణాటక రైతు.. ఇంటికే వెళ్లి వాహనం డెలివరీ

పంతం నెగ్గించుకున్న కర్ణాటక రైతు.. ఇంటికే వెళ్లి వాహనం డెలివరీ
  • రైతుకు మరోసారి క్షమాపణ చెప్పిన షోరూం సిబ్బంది
  • ఘటనపై స్పందించిన ఆనంద్ మహీంద్రా
  • రైతును తమ సంస్థ కుటుంబంలోకి ఆహ్వానించిన ఆనంద్ మహీంద్రా

బెంగళూరు: మహీంద్రా షోరూమ్ లో తనకు జరిగిన అవమానంపై కెంపగౌడ అనే రైతు పంతం నెగ్గించుకున్నారు. షోరూమ్ లో తనకు జరిగిన అవమానంపై రైతు ఆత్మాభిమానం ప్రదర్శించడం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. రైతు పట్ల షోరూమ్ సిబ్బంది ప్రవర్తన సరికాదంటూ రైతు కెంపగౌడకు క్షమాపణ చెప్పగా.. ఘటన ప్రసార మాధ్యమాలు.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు  ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లడం.. ఆయన స్పందించడమే కాదు.. షోరూమ్ సిబ్బందితో క్షమాపణ చెప్పించి.. వాహనాన్ని రైతు ఇంటికే వెళ్లి డెలివరీ చేయమని డీలర్ కు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
ఆదివారం షోరూమ్ సిబ్బంది స్వయంగా రైతు కెంపగౌడ ఇంటికి వెళ్లి ఆయన కోరిన బొలెరో వాహనాన్ని  అందజేసి మరోసారి క్షమాపణలు చెప్పారు. వాహనం డెలివరీకి ముందే మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసి..  రైతు కెంపగౌడ.. ఆయన స్నేహితులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. జనవరి 21వ తేదీన వాహనం కొనేందుకు టుముకూరులోని మహీంద్రా షోరూమ్ కు వెళ్లిన కెంపగౌడ ఆయన స్నేహితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి చర్యలు తీసుకున్నామని.. సమస్య పరిష్కారమైందని భావిస్తున్నట్లు పేర్కొరు. మహీంద్రా వాహనాన్ని ఎంచుకున్నందుకు రైతు కెంపగౌడకు కృతజ్ఘతలు తెలియజేస్తూ.. మహీంద్రా కుటుంబంలోకి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. సంస్థ ట్వీట్ పై ఆనంద్ మహీంద్రా స్వయంగా స్పందించి..రైతు కెంపగౌడను తమ సంస్థ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 
షోరూమ్ లో ఆరోజు  ఏం జరిగిందంటే..  
టుముకూరు పట్టణంలోని మహీంద్రా వాహనం షోరూమ్ లో వాహనం కొనేందుకు రైతు కెంపగౌడ వెళ్లిన ఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. జనవరి 21వ తేదీన కెంపగౌడ బొలెరో వాహనం కొనేందుకు తన స్నేహితులతో కలసి వెళ్లగా.. కెంపగౌడ దుస్తులు.. వేషధారణ చూసి సేల్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. జేబులో 10 రూపాయలనుకున్నావా.. ఈ కారు ధర రూ10 లక్షలంటూ హేళనగా చెప్పడంతో కెంపగౌడ మనస్తాపానికి గురై వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధంలో సిబ్బంది ఛాలెంజ్ పై స్పందించి  గంటలో  పది లక్షలు తెచ్చి చూపించడమే కాదు.. తనకు కారు ఇవ్వాలంటూ పట్టుపట్టారు. సాధారణ పోకిరిగా భావించి పొరబడ్డామని భావించిన షోరూమ్ సిబ్బంది నాలుక్కరచుకున్నారు. వాహనాలకు చాలా డిమాండ్ ఉందని.. వెయింటింగ్ లిస్టు కొనసాగుతోందని.. కనీసం 4 రోజులైనా పడుతుందని నీళ్లు నమిలారు. మరోసారి వాగ్వాదం జరగడంతో  సేల్స్ మన్ క్షమాపణ చెప్పాలంటూ కెంపగౌడ అతని స్నేహితులు డిమాండ్ చేయడమే కాదు.. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని శాంతింప చేసి రైతు కెంపగౌడకు క్షమాపణ చెప్పి పంపగా.. వ్యవహారం స్థానిక మీడియాలో.. అటు తర్వాత జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. 
ఘటనపై స్పందించిన ఆనంద్ మహీంద్రా
టుముకూరు షోరూమ్ లో రైతుకు జరిగిన అవమానం ఘటన జాతీయ మీడియాలో పతాక స్థాయిలో రావడం చూసి ఆనంద్ మహీంద్రా స్పందించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించడమే కాదు.. అన్ని వర్గాల వారి మర్యాదను కాపాడడం అందరి ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. నైతిక విలువలను ఎవరు అతిక్రమించినా తక్షణమే చర్యలుంటాయంటూ.. కస్టమర్లను గౌరవించి వారికి మంచి సేవలు అందించేలా చూడాలని డీలర్లకు సూచించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామంటూ.. రైతు కెంపగౌడను తమ మహీంద్రా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

డబ్ల్యూహెచ్‌వోపై ప్రధాని మోడీకి తృణమూల్ ఎంపీ ఫిర్యాదు

GO 317పై ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్

కేసీఆర్ పిచ్చి నిర్ణయాలకు త్వరలో చరమగీతం

బాలీవుడ్ అందాల తార  కాజోల్కు కరోనా