- అందుకే సమస్యలు పేరుకుపోయినయ్: మంత్రి అజారుద్దీన్
- ముస్లింలందరూ కాంగ్రెస్‌తోనే ఉంటరు
- నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: గత పదేండ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, అందుకే ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని మంత్రి అజారుద్దీన్ ఆరోపించారు. ఇక్కడ నెలకొన్న సమస్యలకు మాజీ సీఎం కేసీఆర్, మున్సిపల్ మాజీ మంత్రి కేటీఆర్ బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
బుధవారం(NOV 05) గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీతో కలిసి అజారుద్దీన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తున్నట్లు బయటకు కనిపించినా..ఇద్దరు కలిసే బరిలో ఉన్నారని అన్నారు.
ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తెలిపారు. ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తున్నదని, మిగతా పార్టీల ప్రచారం ఇక్కడ పెద్దగా కనిపించడం లేదని అన్నారు. కాంగ్రెస్‌తోనే ముస్లింలకు భద్రత, సంక్షేమం అని చెప్పారు. కాంగ్రెస్ మొదటి నుంచీ ముస్లింలకు అండగా నిలుస్తున్నదని, ఇక్కడి ముస్లింలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను అజారుద్దీన్ విజ్ఞప్తి చేశారు. కొందరు తనపై చేస్తున్న విమర్శలను పట్టించుకోనని అన్నారు. మంత్రి పదవి ఇచ్చిన పార్టీ హైకమాండ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై విశ్వాసం ఉంచి మంత్రి పదవి ఇచ్చారని, తాను ఈ పదవితో పూర్తి సంతృప్తిగా ఉన్నానని అన్నారు. మైనార్టీ శాఖలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, ముఖ్యంగా గత రెండేండ్లుగా ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు రాలేదని, వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ముస్లింలకు బీఆర్ఎస్ ఏం చేసింది?: షబ్బీర్‌అలీ
ముస్లింలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ముస్లింలకు కాంగ్రెస్ అండగా నిలిస్తే బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నదని మండిపడ్డారు.‘‘పదేండ్లలో ముస్లింలకు బీఆర్ఎస్ ఏం చేసిందో.. రెండేండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు సిద్ధమా?” అని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ హిందూ, ముస్లింలను చూసే తీరులోనే తేడా ఉందని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లింలంతా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతిచ్చి.. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
