
హైదరాబాద్ ఎల్బీనగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న బైరమలగూడ ఫైఓవర్ నిర్మాణంలో పిల్లర్ టూ పిల్లర్ స్లాబ్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవారిగా చెబుతున్నారు. స్ధానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలానికి చేరుకోనున్న ఇంజినీర్ల బృందం..ఫ్లై ఓవర్ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలించనుంది. నాణ్యత లోపమా..లేక ఏమైనా సాంతేతిక కారణాలా అనేది తేల్చనుంది. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపిస్తామన్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.