కఠినంగా వ్యవహరిస్తే.. దారుణాలు జరిగేవి కావు

కఠినంగా వ్యవహరిస్తే..  దారుణాలు జరిగేవి కావు

తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్లో బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ లో ఇటీవల అఘాయిత్యానికి గురైన బాలిక కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం అక్కడున్న మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ... ఓ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే.. మరింత మందిపై అఘాయిత్యాలు జరిగి ఉండేవి కావనే అభిప్రాయాన్ని  వ్యక్తం చేశారు.

‘‘ఈ కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు దారుణాలకు ఒడిగడుతున్నారు’’ అని సంజయ్ ఆరోపించారు. సంఘటన జరిగి ఇన్ని రోజులు అయినా సీఎం కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందన్నారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేయడం వల్లే నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అనంతరం వారిని రిమాండ్ కు కూడా తరలించారని.. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.