బీజేపీ స్టేట్​ చీఫ్​ రేస్​లో నేను లేను : బండి సంజయ్

బీజేపీ స్టేట్​ చీఫ్​ రేస్​లో నేను  లేను : బండి సంజయ్
  • పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేవి ఊహాగానాలే: బండి సంజయ్​
  • పార్టీ తనకు అంతకంటే పెద్ద బాధ్యతలు అప్పగించిందని కామెంట్​

కరీంనగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని, అవన్నీ ఊహాగానాలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పార్టీ నాయకత్వం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా నూతన కమిటీ బాధ్యులు సంజయ్​ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని బండి సంజయ్​ ఘనంగా సన్మానించారు. జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి కొత్త టీం కృషి చేయాలని కోరారు. అనంతరం సంజయ్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. 

బీజేపీలో పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్ష నియామకం వరకు సమిష్టి నిర్ణయాల మేరకే జరుగుతాయని తెలిపారు. ఇంకా జిల్లా, రాష్ట్ర అధ్యక్ష నియామకాల అంశమే చర్చకు రాలేదని, తనపై అభిమానంతో కొందరు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకత్వం అసలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై దృష్టి సారించనేలేదని చెప్పారు. రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని, అందరూ దానికి కట్టుబడి ఉండాలని కోరారు. మీడియా ఇలాంటి వార్తలు రాయడంవల్ల కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి తనకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయని  ఆరోపించారు. ‘‘దయచేసి మీడియా, సోషల్ మీడియా మిత్రులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇలాంటి కథనాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంది. అట్లాగే వ్యక్తిగతంగా నాకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. దయచేసి ఇకపై అలాంటి కథనాలు రాయొద్దని కోరుతున్నా. రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ప్రతి ఒక్కరూ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నా” అని విజ్ఞప్తి చేశారు.