హైదరాబాద్, వెలుగు: పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి..కాంగ్రెస్ కండువా కప్పుకొని.. అదే పార్టీ టికెట్‌పై ఎంపీలుగా పోటీ చేసినా.. అది అనర్హత కిందకు రాదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. గతంలో పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇలాగే అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇస్తే, అక్కడి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కొట్టేసిందని బుధవారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో.. రక్షించాల్సిన శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పెద్ద పాపం అని అన్నారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఉండటం శోచనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దృశ్యాలు రాష్ట్రమంతా చూసిందని తెలిపారు. గాంధీ భవన్‌లో సంసారం చేస్తూ.. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నా.. వారు ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప.. డూప్లికేట్ గాంధీ కుటుంబానికి తాబేదారులా మారకూడదన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అన్యాయంపై నోరు విప్పాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: రాంచందర్‌రావు
ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను అపహాస్యం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, అది ఫిరాయింపు కాదని స్పీకర్ తీర్పు ఇవ్వడం ఆశ్చర్యకరమన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమేనని పేర్కొన్నారు.
