నీ ఇజ్జత్ దావాలకు భయపడ..లీగల్గా, రాజకీయంగా ఎదుర్కొంటా:బండి సంజయ్

నీ ఇజ్జత్ దావాలకు భయపడ..లీగల్గా, రాజకీయంగా ఎదుర్కొంటా:బండి సంజయ్

 

  • కేటీఆర్​పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
  • నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా
  • నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా?
  • దమ్ముంటే తన సవాల్​ను స్వీకరించాలని డిమాండ్

కరీంనగర్, వెలుగు: కేటీఆర్ లాగా తాను ఇజ్జత్ దావాలు వేయనని, తనపై పరువు నష్టం దావా వేసినంత మాత్రాన భయపడనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కేటీఆర్ ఇజ్జత్ దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ.. తాను న్యాయపరంగా, రాజకీయంగానే ఎదుర్కొంటానని చెప్పారు. కోర్టులపై తనకు నమ్మకం ఉందన్నారు. కేటీఆర్ లాగా ఇజ్జత్ దావాలు వేయాలంటే తాము ఎన్నో కేసులు వేయొచ్చని తెలిపారు. కానీ, తాను ఎవరినీ బెదిరించేందుకు దావాలు వేయనని చెప్పారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సోమవారం రాత్రి కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను లవంగం తింటే తంబాకు అన్నారని విమర్శించారు. ‘‘కేసీఆర్ నన్ను వాడు, వీడు అని తిట్టిండు. నన్ను ఆరు ముక్కలు చేస్తా అన్నడు. దళితుడిని సీఎం చేస్తా అన్నడు. యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నడు. వీటన్నింటిపై ఇజ్జత్ దావాలు వేస్తే మీరు ఏడ ఉంటరు?’’అని బండి సంజయ్ ప్రశ్నించారు. తన మీద 100 కేసులు పెట్టినా భయపడలేదన్నారు. ‘‘నేను తంబాకు తీసుకోవడం లేదని కుటుంబ సభ్యులతో వచ్చి దేవుడు సన్నిధిలో ప్రమాణం చేస్తా. నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబంతో వచ్చి ప్రమాణం చేస్తావా అని ఎన్నో సార్లు సవాల్ విసిరిన. కేటీఆర్ ఎందుకు రావడం లేదు” అని ప్రశ్నించారు. అమెరికాలో కేటీఆర్ ఎవరితో ఉన్నారో తనకు తెలుసని, అయితే తాను వ్యక్తిగత ఆరోపణలు చేయనని బండి సంజయ్ అన్నారు.