- కాంగ్రెస్ అభ్యర్థులకు మంత్రి జూపల్లి పిలుపు
కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సైకిళ్లపై తిరిగి ఇంటింటి ప్రచారం చేయాలని ఎక్సైజ్, పర్యటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. గురువారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 16వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పెబ్బేటి శేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
గడపగడపకూ తిరుగుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, దానిని సూచిస్తూ కౌన్సిలర్ అభ్యర్థులందరూ సైకిళ్లపైనే తిరిగి ప్రచారం చేయాలని చెప్పారు. కొల్లాపూర్ పట్టణం అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వాదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
