
సియోల్: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తరకొరియా కూడా యుద్ధ ట్యాంకులతో రిహార్సల్స్ చేసింది. ఈ ఎక్సర్ సైజ్ ను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన యుద్ధ ట్యాంకులను కిమ్ ఆవిష్కరించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వాటి పనితీరును సైనిక ఉన్నతాధికారులతో కలిసి లైవ్‌లో వీక్షించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత కిమ్ ఓ యుద్ధ ట్యాంకును స్వయంగా నడిపి, సైన్యంలో స్ఫూర్తి నింపారని తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా కేసీఎన్‌ఏ విడుదల చేసింది.