
- బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన కులగణనను తప్పు పట్టడం అంటే రాష్ర్ట ప్రజలను అవమానించడమేనని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. కులగణనను తప్పుపడుతూ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని శనివారం పత్రికా ప్రకటనలో ఆయన తెలిపారు. తెలంగాణలో సర్వేను అభాసుపాలు చేసే ప్రయత్నంకన్నా, కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు చట్టబద్ధత కల్పించే విధంగా ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం జనగణన చేసినట్టుగానే కులగణనను ప్రభుత్వం చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ర్ట ప్రభుత్వం 2 దశల్లో చేపట్టిన గణనలో 97.10 శాతం జనాభా కవర్ అయిందని నిరంజన్ పేర్కొన్నారు. కులగణన పై అసెంబ్లీ, కౌన్సిల్ లో చర్చ జరిగిందని, రెండు సభలు బిల్ పాస్ చేశాయని వెల్లడించారు. జనగణన లో కులగణన కూడా చేయాలని డిమాండ్ తో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని, అయితే గైడ్ లైన్స్, కులగణన ఎలా చేస్తారన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.