
- దొమ్మర, పిచ్చగుంట్ల, బుడబుక్కల కులాల పేర్లు మార్చాలని కమిషన్కు వినతులు
హైదరాబాద్, వెలుగు: తిట్టు పదాలతో ఉన్న పేర్లను మార్చాలని కోరిన దొమ్మర, పిచ్చగుంట్ల, తమ్మలి, బుడబుక్కల, వీరముష్టి కులాల పేర్లను మార్చాలని బీసీ కమిషన్ ప్రభుత్వాన్ని కోరనుంది. కుమ్మర, రజక, మేర కులాల విషయంలో పర్యాయ పదాలు నిర్దిష్ట సిఫారసులతో కూడిన నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నివేదికను సోమవారం బీసీ కమిషన్ ఆమోదించింది. ఖైరతాబాద్ లో కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన కమిషన్ మీటింగ్ జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి వెనకబడిన తరగతుల జాబితాను రూపొందించే క్రమంలో తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చే విషయమై బహిరంగ విచారణ జరిపి, ఈ విషయంలో వినతులు అభ్యంతరాలను స్వీకరించాలని కమిషన్ నిర్ణయించింది.
ఇందుకోసం ఈ నెల 15వ తేదీన ఒక నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని చైర్మన్ నిరంజన్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 9, 10, 11 తేదీల్లో బహిరంగ విచారణతోపాటు ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేది వరకు పోస్టు ద్వారా స్వయంగా కమిషన్ కార్యాలయంలో వినతులు, అభ్యంతరాలను సమర్పించవచ్చు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘సీడ్’ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి కులం సర్టిఫికెట్‌లో డీఎన్ టీ (డినోటిఫైడ్ ట్రైబ్స్) అనే పదాన్ని పేర్కొనాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని ఆయన గుర్తుచేశారు. ఆయా డీఎన్ టీ సర్టిఫికెట్ల జారీ విషయాన్ని పరిశీలించి, విధివిధానాలను ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని, ఇందుకు అవసరమైన సమాచారాన్ని సంబంధిత అధికారుల నుంచి కోరుతామని ఆయన పేర్కొన్నారు.
కొన్ని కులాలను అత్యంత వెనకబడిన తరగతుల (ఎంబీసీ)లలో చేర్చే విషయమై ప్రభుత్వం ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించడానికి అవసరమైన సమాచారాన్ని ఆయా శాఖల నుంచి తీసుకుంటామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న బీసీ కమిషన్ ఈ విషయంలో ఆయా శాఖల అదనపు కార్యదర్శులతో ఈ నెల 19వ తేదీన మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో సీనియారిటి జాబితా రూపొందించడంలో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని కమిషన్ కు ఫిర్యాదులు అందాయని, ఈ అంశంపై రిపోర్ట్ ఇవ్వాలని వీసీని ఆదేశించామని చైర్మన్ నిరంజన్ వెల్లడించారు.