బీసీల రిజర్వేషన్లపై బీజేపీది డబుల్ గేమ్ .. కపట ప్రేమ చూపిస్తూ అన్యాయం చేస్తున్నది : రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు

బీసీల రిజర్వేషన్లపై బీజేపీది డబుల్ గేమ్ .. కపట ప్రేమ చూపిస్తూ అన్యాయం చేస్తున్నది : రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
  • బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఫైర్

బషీర్​బాగ్, వెలుగు: బీసీల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతున్నదని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. బీసీలపై కపట ప్రేమను ఒలకబోస్తూ అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఈశ్వరయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల జాబితాలో, కేంద్రంలోని ఓబీసీల జాబితాలో కూడా ముస్లింలు ఉన్నారు. ఈ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. ఢిల్లీలో చేసిన కామెంట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి.

 సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి’’అని చిరంజీవులు అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోవడం లేదని జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. ‘‘బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు న్యాయపరంగా అవగాహన లేదు. తమిళనాడులో 4 సార్లు అఖిలపక్ష భేటీ, 3 సార్లు తీర్మానం చేసి రాజ్యసభ, లోకసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందాక బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్​లో చేర్చారు. తెలంగాణలోనూ 42 శాతం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్​లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. 9వ షెడ్యూల్​లో చేర్చడం సాధ్యం కాదని అనుకున్నప్పుడు.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకుంటున్నారు?’’అని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు.