- యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతున్నయ్
- సీపీఐ జాతీయ నాయకులు నారాయణ
ఖమ్మం టౌన్, వెలుగు : ‘ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని, యుద్ధాన్ని ఆపేందుకు కనీస ప్రయత్నం చేయడం లేదు, మోదీ ట్రంప్‌కు సాగిలపడడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు, ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో ఐదు శాతం కూడా ఆయనకు లేదు’ అని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ విమర్శించారు. ఖమ్మంలోని గిరి ప్రసాద్ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు.
భారతదేశంపై యుద్ధ ప్రభావం మొదలైందని, దీని కారణంగా గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యయసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చూసి మోదీ భయపడుతున్నారని, 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆదివాసీలకు నష్టం కలిగించే చర్యలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులను చంపి, అడవుల నుంచి ఆదివాసీలను తరిమి ఆ భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
వెలుగుమట్లలో ఇండ్లను కూల్చడం.. తిరిగి అక్కడే పట్టాలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... కమ్యూనిస్టులను బలహీనపర్చడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారన్నారు. నివాస స్థలాల పంపిణీ, ఇండ్ల నిర్మాణం భిక్ష కాదని.. అది ప్రభుత్వ బాధ్యత అన్నారు. సీపీఐ ప్రజాప్రతినిధులకు ఈ నెల 13, 14 తేదీల్లో పాల్వంచలో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు.
