బీసీలకు తీవ్ర అన్యాయం..బీసీ విద్యార్థి సంఘాల ఫైర్​

బీసీలకు తీవ్ర అన్యాయం..బీసీ విద్యార్థి సంఘాల ఫైర్​
  • ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన 
  • కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం
  • అడ్డుకున్న పోలీసులు
  • ఇరువర్గాల మధ్య తోపులాట

ఓయూ/ బషీర్ బాగ్/ సికింద్రాబాద్/ షాద్ నగర్, వెలుగు : టికెట్ల కేటాయింపులో బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ బీసీ విద్యార్థి సంఘాల నేతలు, స్టూడెంట్లు మండిపడ్డారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు స్టూడెంట్ సంఘాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ..

రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బీసీ కులాలకు బీఆర్ఎస్​టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కూడా తన మొండి వైఖరిని మార్చుకొని బీసీలకు దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని, లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ద్వారా రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి నేతలు తాళ్లపల్లి ఓంకార్ సాయి గౌడ్, మహేశ్, వినోద్, సతీశ్, రాజు, సందీప్, వెంకన్న, శివ కుమార్, శ్రీకాంత్ ఉన్నారు. 

బీఆర్ఎస్​ను ఓడిస్తం: రాచాల యుగంధర్ గౌడ్ 

కేసీఆర్ బీసీల ద్రోహి అని, ఆ వర్గాలను విస్మరించిన బీఆర్ఎస్​ను  ఓడించి తీరుతామని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 23 టికెట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ  బషీర్​బాగ్​లోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిరసన తెలిపి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో బీసీల త్యాగం వెలకట్టలేనిదని, అమరులైన వారిలో 90శాతం బీసీలేనని పేర్కొన్నారు.

అర శాతం కూడా లేని వెలమలకు 11 టికెట్లు, 5 శాతం రెడ్డిలకు 40 టికెట్లు ఇవ్వడం అగ్రకుల అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. వచ్చే నెలలో  హైదరాబాద్​లో 5 లక్షల మందితో బీసీల రాజకీయ యుద్దభేరి సభను నిర్వహించి సత్తా చాటుతామని పేర్కొన్నారు. బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు విజయ భాస్కర్, అనుదీప్, అజయ్, చంద్రశేఖర్, గణేశ్, కుమార్, గౌతమ్, శివ తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్​లను అవమానించినట్టే: తెలంగాణ ముదిరాజ్ వెల్ఫేర్ కమిటీ

రాష్ట్రంలో 60 లక్షలకు పైగా జనాభా ఉన్న ముదిరాజ్​లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో ఆ కులాన్ని అవమానించినట్టేనని తెలంగాణ ముదిరాజ్ వెల్ఫేర్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.  ‘ముదిరాజ్​లను ఓట్లు వేయడానికే వాడుకుంటారా..? చట్టసభలకు పంపే ఆలోచన లేదా.? ’అని ప్రశ్నించింది. ఇప్పటికైనా పునరాలోచన చేసి  ముదిరాజ్​లకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది.

లేదంటే బీఆర్ఎస్​లోని ముదిరాజ్ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని కోరింది. ఈ మేరకు కమిటీ నేతలు- బోయిని శివకుమార్ ముదిరాజ్,  రవీందర్  ఒక ప్రకటన రిలీజ్ చేశారు.  షాద్​నగర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ముదిరాజ్ నేతలు మాట్లాడారు. ఓట్ల కోసం వాడుకొని సీట్లు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. ముదిరాజ్ లకు ఏ పార్టీ అన్యాయం చేసినా తగిన బుద్ధి  చెబుతామని వార్నింగ్​ ఇచ్చారు.  రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తుమ్మల గోపాల్ ముదిరాజ్, నేతలు పాల్గొన్నారు.