Cricket World Cup 2023: పాపం జైల్లో ఇమ్రాన్ ఖాన్.. వరల్డ్ కప్ ఫైనల్లో విన్నింగ్ కెప్టెన్లు

Cricket World Cup 2023: పాపం జైల్లో ఇమ్రాన్ ఖాన్.. వరల్డ్ కప్ ఫైనల్లో విన్నింగ్ కెప్టెన్లు

వరల్డ్ కప్ ఫైనల్ చూడడానికి అభిమానులే కాదు ప్రముఖులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ తుది సమరానికి  భారత ప్రధాని మోడీ ఈ మ్యాచ్ కు హాజరుకానున్నారు. ఇక అమితాబ్ బచ్చన్, నాగార్జున, రామ్ చరణ్, వెంకటేష్ లాంటి టాప్ హీరోలు ఈ మ్యాచ్ చూసేందుకు సిద్ధమయ్యారు. ఈ మెగా ఫైనల్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గ్రాండ్ ఫైనల్ చూసేందుకు బీసీసీఐ, ఐసీసీ వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. అలా వచ్చే వారందరికీ ప్రత్యేకమైన బ్లేజర్ ఇవ్వనుంది. 

వరల్డ్ కప్ ఫైనల్ చూసే సమయంలో ఈ లెజెండరీ కెప్టెన్లు అందరూ ఈ స్పెషల్ బ్లేజర్ వేసుకొంటారని తెలుస్తోంది. విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్(1975,1979) కపిల్ దేవ్(1983), అలన్ బోర్డర్(1987), అర్జున రణతుంగ(1996), స్టీవ్ వా(1999), రికీ పాంటింగ్(2003,2007) ఎంఎస్ ధోనీ(2011), మైఖేల్ క్లార్క్(2015), ఇయాన్ మోర్గాన్(2019) మ్యాచ్ కు హాజరయ్యేందుకు రెడీగా ఉన్నారు. అయితే 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు.  ప్రస్తుతం అతను పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దేంతో ఇమ్రాన్ ఖాన్ మినహా మిగిలిన వారికి ఆహ్వానం అందింది. 

తోషఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వచ్చే అయిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. ఇస్లామాబాద్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు అదనపు న్యాయమూర్తి హుమాయూన్‌ దిలావర్‌ శనివారం ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.