బుల్లితెర అతిపెద్ది రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. 15 వారాల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో గొడవలు, మరెన్నో ఎమోషన్ల తర్వాత ఇప్పుడు టైటిల్ విజేత ఎవరో తేలే సమయం వచ్చేసింది. గత వారం సుమన్ శెట్టి, భరణి డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్ నుండి బయటకు వెళ్లారు. ప్రస్తుతం హౌస్‌లో ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, డీమన్ పవన్, కళ్యాణ్ పడాల టాప్-5 కంటెస్టెంట్స్‌గా మిగిలారు. వీరి మధ్య విన్నర్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది.
హోరాహోరీగా టాస్క్‌లు
చివరి వారంలో కంటెస్టెంట్లలో ఉత్సాహం నింపేందుకు బిగ్ బాస్ 'వన్స్ మోర్' పేరిట పాత టాస్క్‌లను మళ్ళీ ఇస్తున్నారు. హౌస్ మేట్స్ మధ్య బెలూన్ టాస్క్, 'పిక్ ది బోన్' టాస్క్ నిర్వహించారు. బెలూన్ టాస్క్ లో తనూజ-కళ్యాణ్ ఒక జోడీగా, సంజన-ఇమ్మాన్యుయేల్ మరో జోడీగా తలపడ్డారు. ముఖానికి ముళ్ల మాస్క్ పెట్టుకుని గాలిలో బెలూన్ పడిపోకుండా ఊదాలి. అయితే, తనూజ బెలూన్ పగిలిపోయిన తర్వాత బెల్ కొట్టడంపై ఇమ్మాన్యుయేల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక్కడ తనూజ తన వాదనతో గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. ఈ టాస్క్‌లో సంచాలక్‌గా ఉండటానికి పవన్ మొదట నిరాకరించినా, చివరకు సరేనన్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది డే..
తర్వాత 'పిక్ ది బోన్' టాస్క్‌ను పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో డీమన్ తన వేగాన్ని ప్రదర్శించి తొలి రౌండ్ గెలిచాడు. రెండో రౌండ్‌లో కళ్యాణ్ గెలవగా, మూడో రౌండ్‌లో డీమన్, కళ్యాణ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో కళ్యాణ్ కింద పడిపోగా, డీమన్ బోన్ దక్కించుకున్నాడు. ఈ వారం ప్రతిరోజూ టాస్క్‌లు గెలిచిన వారికి 'ప్లేయర్ ఆఫ్ ది డే' అవార్డును బిగ్ బాస్ ప్రకటిస్తున్నారు. ఇది గెలిచిన వారికి వారు కోరుకున్న ఫుడ్ ట్రీట్‌తో పాటు, తమ కుటుంబ సభ్యుల నుండి వచ్చే వీడియో సందేశాలను చూసే అదృష్టం లభిస్తోంది. ఇక అత్యంత ఉద్వేగభరితమైన 'బిగ్ బాస్ జర్నీ' వీడియోలు కూడా త్వరలో ప్రదర్శించనున్నారు. గార్డెన్ ఏరియాలో ఫోటో గ్యాలరీని చూస్తూ కంటెస్టెంట్స్ కన్నీరు పెట్టుకోవడం ఫ్యాన్స్‌ను సైతం ఎమోషనల్ చేయనుంది.
ఓటింగ్‌లో కళ్యాణ్ హవా.. !
సాధారణంగా సీజన్ ముగిసే సమయానికి ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఈసారి కళ్యాణ్ పడాల, తనూజ మధ్య టైటిల్ పోరు నెలకొంటుందని అందరూ భావించారు. కానీ సోషల్ మీడియా ట్రెండ్స్ ,అన్-అఫీషియల్ పోల్స్ చూస్తుంటే సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. కళ్యాణ్ పడాల తన ప్రవర్తన,టాస్క్‌లలో చురుకుదనంతో ఓటింగ్‌లో భారీ మెజారిటీతో దూసుకుపోతున్నాడు. తనూజ రెండో స్థానంలో ఉన్నప్పటికీ, కళ్యాణ్‌కు వస్తున్న ఓటింగ్ శాతం ముందు ఆమె వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది.
గ్రాండ్ ఫినాలే ఎప్పుడు?
ఈ ఆదివారం , డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే వైభవంగా జరగనుంది. సినీ తారల సందడి, అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్‌ల మధ్య బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని నాగార్జున ఎవరి చేతికి అందిస్తారో చూడాలి...
