సైబర్ నేరాలను ఎంతగా అరికడుతున్న దేశంలో ఎదో ఒక చోట కొత్త కొత్త పద్దతిలో పుట్టుకొస్తూనే ఉంది. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రేమానంద్ ఆన్‌లైన్‌లో Samsung Galaxy Z Fold 7 స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేసాడు. అయితే ఆర్డర్ చేసిన ఫోన్ కాకుండా ఫోన్ బాక్సులో టైల్ ముక్క రావడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. చివరికి అమెజాన్ డెలివరీ స్కామ్‌లో రూ.1.86 లక్షలు పోగొట్టుకున్నానని తెలుసుకున్నాడు.
వివరాల ప్రకారం బెంగళూరు యెలచెనహళ్లి నివాసి అయిన ప్రేమానంద్ అక్టోబర్ 14న HDFC క్రెడిట్ కార్డును ఉపయోగించి Samsung Galaxy Z Fold 7 ఆర్డర్ చేసి పేమెంట్ కూడా చేసాడు. అక్టోబర్ 19న సాయంత్రం 4.16 గంటల సమయంలో ఫోన్ డెలివరీ అయింది. అయితే, ఫోన్ అన్‌బాక్సింగ్ వీడియో రికార్డ్ చేస్తుండగా Samsung హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా బాక్స్ లోపల డబ్బా ఆకారంలో తెల్లటి టైల్ ముక్క మాత్రమే ఉండటం చూసి నోరెళ్లబెట్టాడు. దింతో అతను వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసాడు.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4) (మోసం), 319 (వ్యక్తిగతంగా మోసం చేయడం) తో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66D (కంప్యూటర్ వనరులను ఉపయోగించి వ్యక్తిగతంగా మోసం చేయడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ స్కామ్ వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభి విచారణ చేస్తున్నారు.
►ALSO READ | బెంగళూరులో దారుణం: ఇంట్లోకి రావొద్దన్నందుకు కూతురి స్నేహితులే ఆమెను చంపేశారు... !
మరోవైపు ముంబైకి చెందిన మరో కేసులో ఆగస్టులో ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా లీటరు పాలు ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించి 71 ఏళ్ల ఓ మహిళ రూ.18.5 లక్షలు పోగొట్టుకుంది .
ముంబై వడాలాలో నివసించే ఆ మహిళకు ఒక పాల కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయిన దీపక్ అనే వ్యక్తి నుండి కాల్ వచ్చింది. అతను ఆమెకు ఒక లింక్ పంపి ఆర్డర్ చేయడానికి ఆమె వివరాలు ఎంటర్ చేయమని అడిగాడు. ఆన్ లైన్ మోసాలు, సైబర్ స్కాంల ఉచ్చు గురించి తెలియక, ఆమె ఫోన్లో చెప్పినట్లు పాటిస్తూ దాదాపు గంటసేపు కాల్‌లోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత, ఆమె సేవింగ్స్ డబ్బు మొత్తం బ్యాంకు అకౌంట్స్ నుండి కాళీ అయినట్లు తెలిసింది. దింతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్రాడ్ లింక్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్‌కు యాక్సెస్ తీసుకుకొని డబ్బు కొట్టేశారని భావిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ షాపింగ్/కొనుగోళ్లు చేసేటప్పుడు లేదా వ్యక్తిగత వివరాలను షేర్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
