
న్యూఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను విచారించిన ఈడీ తాజాగా ఈ కేసులో మరో ముగ్గురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప, యువరాజ్ సింగ్, యాక్టర్ సోనుసూద్‌కు మంగళవారం (సెప్టెంబర్ 15) ఈడీ సమన్లు జారీ చేసింది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ముగ్గురిని మూడు వేర్వేరు తేదీల్లో విచారణకు పిలిచింది. 2025, సెప్టెంబర్ 22న రాబిన్ ఊతప్పు, 23వ తేదీన యువరాజ్ సింగ్, 24వ తేదీన సోనుసూద్‌ను విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ.
1xBet, జంగ్లీ రమ్మీ, జీట్‌విన్, లోటస్365 వంటి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేసి హవాలా ద్వారా డబ్బులు తీసుకుని మనీ లాండరింగ్, పన్ను ఎగవేతకు పాల్పడ్డారనేది ఈ కేసులోని నిందితులపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, మిమి చక్రవర్తి, ఊర్వశి రౌతేలా వంటి ప్రముఖులను ఈడీ విచారించి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది.