బెంగళూర్: కర్నాటకలోని శిరహట్టి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమానీ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు శనివారం (ఫిబ్రవరి 21) ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరూ పీఏలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఓ రిటైనింగ్ వాల్ నిర్మాణం కాంట్రాక్ట్ కోసం క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్ పూజారి ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమానీని సంప్రదించాడు. రిటైనింగ్ వాల్ కాంట్రాక్ట్ తనకే ఇప్పించాలని కోరాడు. ఇందుకు ఎమ్మెల్యే లమానీ రూ.11లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ విజయ్ పూజారి లోకాయుక్త పోలీసులను ఆశ్రయించాడు.
►ALSO READ | fake universities: వామ్మో.. దేశంలో ఇన్ని నకిలీ యూనివర్సిటీలా?.. ఢిల్లీలోనే అధికం
ఈ మేరకు రంగంలోకి దిగిన లోకాయుక్త పోలీసులు ట్రాప్ ఆపరేషన్ చేపట్టారు. ప్లాన్ ప్రకారం సదరు కాంట్రాక్టర్ శనివారం (ఫిబ్రవరి 21) ఎమ్మెల్యేకు మొదటి విడతలో భాగంగా రూ.5 లక్షలు లంచం ఇస్తుండగా లోకాయుక్త పోలీసులు అకస్మికంగా రైడ్ చేసి ఎమ్మె్ల్యేను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరూ వ్యక్తిగత సహయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
లంచం ఇవ్వాలని వీరిద్దరూ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చారని పోలీసులు ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే లమానీ నివాసం, కార్యాలయాల్లో లోకాయుక్త పోలీసులు సోదాలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడటం కర్నాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
