అంతుచిక్కని ప్రాణాంతక వైరస్..జూలో పులులన్నింటికి ఒకేసారి సోకింది. వైరస్ వేగంగా వ్యాపించడంతో తీవ్రంగా జబ్బుపడి డజన్లకొద్ది పులులు ప్రాణాలొదిలాయి. వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా పులులను రక్షించలేకపోయారు.థాయిలాండ్‌లోని ఓ జూలో డజన్ల కొద్దీ పులులు ఒక ప్రమాదకరమైన వైరస్ వల్ల మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
థాయ్ లాండ్ లోని శ్రీ రాచా టైగర్ జూలో ప్రాణాంతక వైరస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో 72 పులులు చనిపోయాయి. పులుల కళేబరాలను పరిశీలించగా కనైన్ డిస్టెంపర్ అనే అత్యంత వేగంగా విస్తరించే వైరస్ తోపాటు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే బ్యాక్టీరియా సోకిందని తేలింది. ఈ వైరస్ సాధారణంగా కుక్కలు, పెద్ద పులులు, సింహాలు, పెద్ద పిల్లి జాతులకు సోకుతుందట. ఈ వైరస్ శ్వాసకోశ సమస్యలు, జ్వరం, నరాల సమస్యలకు కారణం అవుతుందని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.
శ్రీ రాచా టైగర్ జూలో చాలా పులులకు ఈ వైరస్ సోకింది.. వేగంగా విస్తరించే లక్షణంగా ఉండటంతో తక్కువ టైంలో జూలోని పులులన్నింటికి వైరస్ సోకింది. వైరస్ ను అధికారులు గుర్తించేలోపు పెద్ద సంఖ్యలో పులులు మరణించాయి. అయితే కొన్ని పులులను టీకాలు వేయడం ద్వారా జూ అధికారులు రక్షించారు.
రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని కన్హా నేషనల్ పార్క్‌లో ఇటువంటి ఘటనే జరిగింది. ప్రధాని మోదీ ఆఫ్రికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 8 చిరుతలు కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే మృతిచెందడం అప్పట్లో సంచలనంగా మారింది. చిరుతలు చనిపోవడానికి ఇన్‌ఫెక్షన్లు, అస్వస్థత ప్రధాన కారణాలుగా గుర్తించారు.
