న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. శనివారం (ఫిబ్రవరి 21) ఐరిష్‌కు చెందిన తన స్నేహితురాలు సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నాడు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అతి కొద్ది మంది సమక్షంలో జరిగిన ఈ వేడుకలో గబ్బర్ తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ధావన్ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మేరే యార్ కి షాదీ హై (నా మిత్రుడికి పెళ్లి అయింది) అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు. మరోవైపు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శిఖర్ ధావన్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఎవరీ సోఫీ షైన్..?
ఐరిష్ జాతీయురాలైన సోఫీ షైన్ 1990లో జన్మించారు. లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఆమె డిగ్రీ పొందింది. సోఫీ ఐర్లాండ్‌లోని కాజిల్‌రాయ్ కాలేజీలో తన డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె శిఖర్ ధావన్ ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. గత ఏడాది జూన్‌లో దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకున్న ధావన్- సోఫీ షైన్ జంట కొన్ని నెలల పాటు రిలేషన్లో ఉన్నారు.
ఆ తర్వాత వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. తన కార్పొరేట్ కెరీర్‌తో పాటు, ఆమె శిఖర్ ధావన్ ఫౌండేషన్‌లో కూడా చురుకుగా పాల్గొంటుంది. అంతేకాదు వివిధ సామాజిక కార్యక్రమాలలో ధావన్‌తో కలిసి పనిచేస్తుంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా మొదటిసారి వీరి ప్రేమ వ్యవహారం బయటికి వచ్చింది.
ఆయేషా ముఖర్జీతో విడాకులు:
ధావన్ గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి జోరావర్ అనే 11 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. బెంగాల్‌లో పుట్టి మెల్‌బోర్న్‌లో సెటిలైన మాజీ కిక్ బాక్సర్ అయేషాను ధావన్ 2012లో పెళ్లి చేసుకున్నాడు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ద్వారా ఆమెతో ధావన్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆసీస్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌కు విడాకులు ఇచ్చిన ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైగా, వయసులో తనకంటే11 ఏళ్లు పెద్దదైన ఆయేషాతో శిఖర్ ప్రేమలో పడ్డాడు. 2014లో వీరిద్దరికీ కొడుకు జొరావర్ పుట్టాడు.
►ALSO READ | IND vs SA: 2024 ఫైనల్లో ఓటమిని మర్చిపోయాం.. క్వింటన్ డికాక్ ఆసక్తికర వ్యాఖ్యలు
పెళ్లయినప్పటి నుంచి ఈ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించేవాళ్లు. అయేషా మొదటి భర్త పిల్లలు అలియా, రియాను ధావన్ దత్తత తీసుకున్నాడు. వాళ్లను ఎంతో ప్రేమగా చూసేవాడు. అందరినీ తనతో పాటు మ్యాచ్‌లు, ఫారిన్ టూర్స్‌కు తీసుకెళ్లేవాడు. అలాగే, భార్యతో కలిసి వర్కౌట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. అలాంటి జంట 2021లో తొమ్మిదేళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికింది.
ఓపెనర్‌గా టీమిండియాలో మార్క్:
2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గబ్బర్.. డిసెంబర్ 2022లో చివరిసారి భారత జట్టులో కనిపించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన అద్భుత ఆటతీరుతో ఆనతీ కాలంలోనే మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత జట్టు తరఫున 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడిన ధావన్.. వరుసగా వన్డేల్లో 6793, టెస్టుల్లో 2315, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు ధావన్ ఖాతాలో ఉన్నాయి.
Happy Married life to Shikhar Dhawan ♥️ pic.twitter.com/dDPVkvIgYm
— Johns. (@CricCrazyJohns) February 21, 2026
