నాడు తెలంగాణ.. నేడు బిహార్!

నాడు తెలంగాణ.. నేడు బిహార్!

దేశ ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న కాంగ్రెస్​ను ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డదారిలో అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోంది. 2024 లోక్​సభ ఎన్నికలు మొదలుకొని వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గెలుస్తోంది.  ఈ నేపథ్యంలో పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని,  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ అధినేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారు. 

ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తూ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్న బీజేపీ కుట్రలను బహిర్గతం చేసిన రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ‘ఓట్ చోరీ’ ఉద్యమం చేపట్టింది. బిహార్ రాజధాని పాట్నా వేదికగా 2025 సెప్టెంబర్ 24న జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో.. దేశంలో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ప్రధానంగా చర్చించనున్నారు. 

బీజేపీ  లోక్​సభ ఎన్నికలతోపాటు హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో  విజయం సాధించడం 
వెనుకున్న కుట్రలతో కూడిన వ్యూహాలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బట్టబయలు చేయడంతో బీజేపీ, ఈసీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.   రాహుల్ గాంధీ కర్నాటకలోని  మహదేవపురం నియోజకవర్గంలోని ఎన్నికల జాబితాలో తక్కువ సమయంలో లక్షకుపైగా ఓట్లను చేర్పించి చేసిన అవకతవకలను ఎత్తిచూపారు. 

ఈసీ పారదర్శకత పాటించాలిబిహార్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో భంగపాటు తప్పదనే నిర్ణయానికి వచ్చిన అధికార బీజేపీ ఈసీని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యానికి తలవొంపులు తెచ్చేలా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఓటర్ల జాబితాలో ప్రక్షాళన పేరుతో బిహార్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్) చేపట్టి ఉద్ధేశపూర్వకంగా ఒక వర్గంవారిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 65 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించి ‘ఓట్ చోరీ’కి  పాల్పడడం నియంతృత్వ పోకడలకు పరాకాష్ట. 

బిహార్లో ఎస్ఐఆర్ చేపట్టిన విధానంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఓటర్ల గుర్తింపు కార్డు ఆమోదానికి  సంబంధించి ఆధార్​ కార్డును కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లన్నింటినీ ఈసీఐ అధికారిక వెబ్​సైట్​లో పెట్టి పారదర్శకత పాటించాలని, ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ఏ మాత్రం తేడా వచ్చినా అందుకు ఈసీదే పూర్తి బాధ్యత అని చెప్పడం ప్రజాస్వామ్యవాదుల నైతిక విజయం.

ఓట్ అధికార్ యాత్రకు  విశేష ఆదరణ

అధికార బీజేపీ కనుసన్నల్లో నడుచుకుంటున్న ఈసీ వ్యవహార శైలిని ఎండగడుతూ ‘ఇండియా’ కూటమి పార్లమెంట్ వేదిక మొదలుకొని దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టింది.  బిహార్లో ఎస్ఐఆర్ నిర్వహణపై, ఎంచుకున్న సమయం, దేశవ్యాప్తంగా ‘ఓట్ చోరీ’పై   రాహుల్ గాంధీ లేవనెత్తిన  పలు సందేహాలపై సహేతుకంగా స్పందించాల్సిన భారత ఎన్నికల సంఘం అధికారులు తమ బాధ్యతలను విస్మరించింది. 

అధికార ఎన్డీఏ, ఈసీ అధికారుల కుట్రలకు, బెదిరింపులకు ఏమాత్రం వెరవని  రాహుల్ గాంధీ బీజేపీ ‘ఓట్ చోరీ’పై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.   ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్లో విజయవంతంగా 16 రోజులపాటు 1,300 కిలోమీటర్లకు పైగా ‘ఓట్ చోర్,  గద్దె చోర్’ నినాదంతో నిర్వహించిన ‘ఓట్ అధికార్ యాత్ర’కు విశేషంగా ప్రజా స్పందన లభించింది.   ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న బీజేపీ పాచికలను బిహార్ రాజధాని పాట్నా వేదికగా వమ్ము చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.  

ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత సమావేశాలను పాట్నాలో ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  పిలుపునందుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు  నిర్వహించిన ‘జై బాపు, జై బీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలపై సమీక్ష జరుపుతారు. ‘ఓట్ చోరీ’తో సహా  బీజేపీ  అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాటాలపై  సీడబ్ల్యుసీ చర్చించి పార్టీ నేతలకు, కార్యకర్తలకు మార్గదర్శకాలిస్తుంది.

సామాజిక న్యాయానికి పెద్దపీట

దేశంలో కులగణన చేపట్టాలని దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో విజయవంతంగా కులగణన చేపట్టి దేశానికి స్ఫూర్తిగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా కులగణనపై డిమాండ్ రావడంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఇందుకు తలొగ్గడం కాంగ్రెస్ విజయం.   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు, రైతులు, యువత, ఉద్యోగ, నిరుద్యోగ, కార్మిక.. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ  ‘తెలంగాణ రైజింగ్ 2047’  నినాదంతో దూసుకుపోతుంది. 

సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగినచోట గెలుపే!

 రెండేళ్ల క్రితం 2023 సెప్టెంబర్​లో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్​లో  సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారు. సీడబ్ల్యూసీ  సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతల మార్గదర్శకంలో నడుచుకున్న కాంగ్రెస్  తెలంగాణలో  భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. 

ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతమై బిహార్ శాసనసభ ఎన్నికల సమయంలో పాట్నాలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్​ కూటమి భారీ విజయానికి నాంది పలకడం ఖాయం. నాడు తెలంగాణ.. నేడు బిహార్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నికలవేళ  సీడబ్ల్యూసీ జరిగిందంటే అక్కడ కాంగ్రెస్​దే గెలుపు.

-బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు-