బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే : ఎంపీ లక్ష్మణ్​

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే : ఎంపీ లక్ష్మణ్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీని ఎదుర్కోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే అహంకారం, కాంగ్రెస్ అంటే  అబద్ధాలు, బీజేపీ అంటే అభివృద్ధి అంటూ చెప్పుకొచ్చారు.  పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్​ రుణమాఫీ ఎత్తుగడ వేస్తున్నదని అన్నారు. ఆగస్టు15 వరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఎన్వీ సుభాశ్​, మాధవి, కిశోర్ పోరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. 

సోనియాగాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్​ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వరికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, అమలు చేయలేదన్నారు. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో ముందుకు వస్తున్నారని విమర్శించారు. బోనస్ కూడా వచ్చే వరి పంటకు ఇస్తామంటూ వాయిదా వేస్తున్నారని, కాంగ్రెస్ ఏమైనా వాయిదాల పార్టీనా?  అని ప్రశ్నించారు. తాజాగా ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయలేకపోతున్నామని తప్పించుకుంటున్నారని, కానీ సర్కారు వద్ద హామీల అమలుకు  నిధులు లేవని తెలియదా? అని అడిగారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతిపరులంటూ అనేకసార్లు విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ బీఆర్ఎస్​ఎమ్మెల్యేలను ఎలా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో చేరగానే అవినీతి తొలిగిపోతుందా? దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని లక్ష్మణ్​ డిమాండ్ చేశారు.