- కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్టు చేసే ఉద్దేశం కాంగ్రెస్ సర్కార్‌కు లేదు: రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ‘దొంగనే దొంగ.. దొంగ’ అని అరిచినట్టుగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. అధికారంలోకి రాగానే రెండు నెలల్లో విచారణ చేసి, లక్ష కోట్ల సొమ్ము కక్కిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ ఎందుకు బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కాళేశ్వరంపై, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చకు తాము సిద్ధమని.. దానికి సీఎం సిద్ధమా? అని సవాల్ విసిరారు. చర్చకు ఎక్కడికి రమ్మంటారో చెప్పాలన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో రఘునందన్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ఆరోపణలు వచ్చాయని అన్నారు. ‘‘సీబీఐ విచారణను ఆపాలని ఐఏఎస్ అధికారులు, హరీశ్ రావు కోర్టుకు వెళ్లారు.
కాళేశ్వరంపై 4 రిట్ పిటిషన్లు న్యాయస్థానంలో ఉన్నాయి. సీబీఐ విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఉండగా సీబీఐ విచారణ ఎలా ముందుకెళ్తుంది?” అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ను కబరస్తాన్‌గా మార్చడం కోసం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారా? అని వ్యాఖ్యానించారు. బీసీ కోటా కింద అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే, మరి బీసీలు ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యేల అరెస్టుకు గవర్నర్‌కు సంబంధమేంటి? నాడు రేవంత్ అరెస్టుకు కేసీఆర్ గవర్నర్ అనుమతి తీసుకున్నారా?’’ అని ప్రశ్నించారు. కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదన్నారు.
