- ముగింపు దశకు జూబ్లీహిల్స్ బై పోల్ క్యాంపెయిన్
- ఇప్పటి వరకు పాల్గొనని కీలక నేతలు.. అయోమయంలో కేడర్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు దూరంగా ఉంటున్నారు. ప్రచారపర్వం ముగింపు దశకు వచ్చినా.. పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా పేరున్న ఏ ఒక్క నేత ప్రచారంలో పాల్గొనకపోవడంతో ఆ పార్టీ కేడర్‌లోనూ అయోమయం నెలకొన్నది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. అయినప్పటికీ కీలక నేతలెవరూ ప్రచారానికి రాకపోవడం చర్చనీయాంశం అవుతున్నది.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్నది. ప్రచారానికి మరో 3 రోజుల సమయమే ఉంది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కానీ, దానికి తగ్గట్టు కీలక నేతలెవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు. ఫైర్ బ్రాండ్లుగా పేరున్న కేంద్రమంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ క్యాంపెయిన్‌కు దూరంగా ఉన్నారు.
బండి సంజయ్ మాత్రం కేవలం అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలోనే పాల్గొన్నారు. ఆ టైమ్‌లో ఆయన స్పీచ్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అర్వింద్ ఇప్పటి వరకూ ఎక్కడా పాల్గొనలేదు. మరోపక్క బీసీ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాజాగా జనసేన మద్దతు ప్రకటించడంతో ఏపీ నేతలు బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు.
జాతీయ స్థాయి నేతలూ దూరం
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారంలో కనిపించడం లేదు. బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో తొలి పేరున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు జూబ్లీహిల్స్ వైపు రాలేదు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, కేంద్రమంత్రి మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోపక్క జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ మాత్రం ఇంటర్నల్ మీటింగ్ లో పాల్గొనగా, స్టేట్ ఇన్చార్జ్గా ఉన్న అభయ్ పాటిల్ ప్రచారంలో పాల్గొనలేదు.
జాతీయ నేతలు అన్నామలై, బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి తదితర కీలక నేతలెవరూ జూబ్లీహిల్స్ వైపు చూడటం లేదు. వీరంతా స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉండి.. రాకపోవడంపై కేడర్‌లోనూ కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నది. క్యాంపెయిన్ నిర్వహణలో సమన్వయలోపం ఉందనే వాదనలూ ఉన్నాయి.
