రాష్ట్రంలో వన్‌మోటో కరెంట్ బండ్ల ప్లాంట్​

రాష్ట్రంలో వన్‌మోటో కరెంట్ బండ్ల ప్లాంట్​
  • రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న కంపెనీ

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్​ టూవీలర్లు తయారు చేసే వన్ మోటో తెలంగాణలో తయారీ యూనిట్‌‌‌‌ను నెలకొల్పేందుకు  రూ. 250 కోట్లు ఇన్వెస్ట్​ చేయనుంది. జహీరాబాద్​ లేదా చంగిచర్లలో ప్రభుత్వం భూమి కేటాయించే అవకాశం ఉందని, జాగా రాగానే నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. "ప్లాంట్ ప్రారంభించిన మొదటి దశలో కనీసం 40 వేల యూనిట్లను తయారు చేయాలని టార్గెట్​గా​ పెట్టుకున్నాం. రెండేళ్లలో కెపాసిటీని లక్ష వరకు తీసుకెళ్తాం. కొంతకాలం తరువాత ఇక్కడే ఫోర్​ వీలర్లనూ తయారు చేస్తాం" అని వన్ మోటో ఇండియా కో–ఫౌండర్​, పార్ట్​నర్​ సమీర్ మొయినుద్దీన్ చెప్పారు.

15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కొత్త తయారీ ప్లాంట్‌‌లో సెమీ రోబోటిక్స్‌‌ వంటి లేటెస్ట్​ టెక్నాలజీలను ఉపయోగిస్తామని వెల్లడించారు. వన్ మోటో ఇండియా సీఈవో శుభాంకర్ చౌదరి మాట్లాడుతూ ఈ ప్లాంట్ వల్ల దాదాపు 500 మందికి జాబ్స్​ వస్తాయని, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ సందర్భంగా వన్​ మోటో మూడు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. - బైకా, ఎలెక్టా,  కమ్యుటాలను లాంచ్​ చేసింది. వీటి ధరలు వరుసగా రూ.1.80 లక్షలు, రూ.రెండు లక్షలు, రూ.1.30 లక్షలు.  బ్రిటిష్ మొబిలిటీ కంపెనీ అయిన వన్​ మోటోను ఇండియాలో ఎల్లీసియం ఆటోమోటివ్స్ ప్రమోట్​ చేస్తోంది. దీనికి ఇప్పటికే 75 మంది డీలర్లు ఉన్నారు. బ్రాండ్ హెడాఫీసు హైదరాబాద్‌‌లో ఉంది.