- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు: మంత్రి జూపల్లి
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం బోరబండ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరించి మద్దతు కోరారు. అనంతరం బోరబండ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఫీరోజ్, అక్బర్, బసవరాజు, కేశవులు, రవుఫ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మెచ్చి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు వంటి అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయన్నారు.
