రూ.2వేల నోట్లకు చిల్లర ఇవ్వలేం : పెట్రోల్ బంకుల షాకింగ్ డెసిష‌న్

రూ.2వేల నోట్లకు చిల్లర ఇవ్వలేం : పెట్రోల్ బంకుల షాకింగ్ డెసిష‌న్

రూ.2వేల నోట్ల ఉపసంహరణపై ఇటీవల కేంద్రం ప్రకటన జారీ చేయడంతో చాలా మంది రూ.2వేల నోటుతో పెట్రోల్ పంపుల వద్ద క్యూలు కడుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.2వేల నోటును ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ పంపుల వద్దకు రూ.2వేల నోటుతో చేసే చెల్లింపులు రోజురోజూకు ఎక్కువవుతున్నాయి. రూ.2వేల నోట్ల కస్టమర్లు పెరగడం వల్ల పెట్రోల్ పంపు సిబ్బందికి తిరిగి చిల్లర ఇవ్వడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు చిల్లరను అందుబాటులో ఉంచుకోవాలని లేదా యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతిని ఉపయోగించాలని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (TPDA) తమ వినియోగదారులను కోరింది.

కస్టమర్ల నుంచి తాము చిల్లర(ఛేంజ్)ను మాత్రమే స్వీకరిస్తామని టీపీడీఏ ఓ ప్రకటనలో తెలిపింది. చాలా మంది రూ.2వేల నోటుతో వస్తున్నందున తమకు చిల్లర ఇవ్వడం కష్టంగా మారిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. వాటిని సెప్టెంబర్ 30, 2023 వరకు మార్చుకోవాలని వెల్లడించింది.