బనకచర్ల టెక్నో ఎకనామికల్‌ అప్రైజల్స్ ఆపం

బనకచర్ల టెక్నో ఎకనామికల్‌ అప్రైజల్స్ ఆపం
  • అన్ని రాష్ట్రాలతో మాట్లాడే ముందుకెళ్తం 
  • తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ  

హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కార్ చేపట్టిన పోలవరం బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు టెక్నో ఎకనామికల్‌ అప్రైజల్స్ ప్రక్రియ ఆగబోదని కేంద్ర జలశక్తిశాఖ తేల్చి చెప్పింది. తెలంగాణతో పాటు గోదావరి బేసిన్‌ రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంప్రదింపులతోనే ముందుకు పోతామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్​20 రోజుల క్రితం సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాసినట్టు తెలిసింది. పీబీ లింక్​ప్రాజెక్టు ప్రీ ఫిజిబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్‌)‌ను వ్యతిరేకిస్తూ జూన్‌లో సీఎం రేవంత్​రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వొద్దంటూ ఆ లేఖలో ఆయన తేల్చి చెప్పారు. 

ఏపీ చేపట్టే ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర జలశక్తి శాఖ సెప్టెంబర్​ 23న రిప్లై ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పీబీ లింక్​పీఎఫ్ఆర్‌‌ను సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ) పరిశీలిస్తున్నదని సీఆర్​పాటిల్​చెప్పినట్టు తెలిసింది. పీఎఫ్ఆర్‌‌ను ఇప్పటికే గోదావరి బేసిన్​లోని అన్ని రాష్ట్రాలకూ పంపినట్టు తెలిపారు. ఆ ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాల మేరకు ప్రాజెక్టు టెక్నో ఎకనామికల్​అప్రైజల్​ను నిబంధనల ప్రకారం చేపడతామని పేర్కొన్నారు.