19న వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటన

19న వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటన

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 19వ తేదీన వనపర్తి జిల్లా నుంచి జిల్లాల పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. జిల్లాల పర్యటనకు ముందు పార్టీ నాయకులతో ఈనెల 17న తెలంగాణ భవన్ లో చర్చించి నిర్ణయాలు ప్రకటించనున్నారు. పార్టీ నాయకులు చేసిన సలహాలు, సూచనలను క్షేత్ర స్థాయిలో ఎలా అమలు చేయాలన్నది నిర్ణయించేందుకు మరుసటి రోజే జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 
దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని.. అన్ని కులాలకు దళిత బంధు తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీల అమలు కోసం కార్యాచరణ తయారు చేసి క్షేత్ర స్థాయిలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్ అటు పార్టీ నాయకులతోనూ చర్చించి.. వారి సలహాలు, సూచనల మేరకు జిల్లాల కలెక్టర్లను సమయాత్తం చేసేందుకు సిన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
ఈనెల 18న దళితబంధు ఇతర పథకాలు, అంశాలపై జిల్లా కలెక్టర్లతో ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారని సమాచారం. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాలో అమలులోకి వచ్చిన దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో వచ్చే మార్చి లోపు అమలు  చేసే అంశం పై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అవసరమైతే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణాకార్యక్రమాల నిర్వహించాలనే ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ధాన్యం సేకరణ అంశం పై స్పష్టత ఇచ్చేందుకు వ్యవసాయ అధికారులతో కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 
హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతానని చెప్పిన కేసీఆర్ ఈ దిశలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ.. పార్టీ, అధికారుల సమావేశాల్లో స్పష్టత ఇచ్చి ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఈనెల 19వ తేదీన వనపర్తి జిల్లా పర్యటన ఖరారైంది. జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించనున్న కేసీఆర్... అలాగే అదే జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
20న జనగామ జిల్లా పర్యటన
జిల్లాల పర్యటనలో భాగంగా ఈనెల 20వ తేదీన జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్ స్థానికంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీటితో పాటు వీలైనంత త్వరలోనే మరికొన్ని జిల్లాలు నియోజకవర్గాల పర్యటన చేపట్టనకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త జిల్లాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న కలెక్టరేట్లతోపాటు పార్టీ కార్యాలయాలను కూడా కేసీఆర్ ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.