కృష్ణా జలాల్లో తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలు స్లోగా సాగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు కట్టడం కాదు కదా.. ఉన్న ప్రాజెక్టుల కెపాసిటీ పెంచే ప్రయత్నాలు జరగలేదు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వమూ ఆ దిశగా ఆలోచన చెయ్యలేదు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కృష్ణా నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఓ మంచి ఆలోచన చేసింది. దాదాపు 360 టీఎంసీల వినియోగాన్ని చూపించేలా పలు రిజర్వాయర్లకు ప్రణాళికలు వేసింది. అందుకు అనుగుణంగానే 16 ప్రాజెక్టులు/రిజర్వాయర్లు చేపట్టేందుకు నిరుడు సెప్టెంబర్ 16నే జీవో 34 కూడా రిలీజ్ చేసింది. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), సర్వే పనులు పూర్తి చేయాలని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఆ అడుగు అక్కడే ఆగిపోయింది. జీవో ఇచ్చి దాదాపు ఐదు నెలలైతున్నా.. దానికి సంబంధించి పనులకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కేవలం జీవో ఇచ్చి పక్కనపెట్టారన్న చర్చ ఇరిగేషన్ వర్గాల్లో జరుగుతున్నది. ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒకటి. 100 టీఎంసీలు తరలించుకునేలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చేందుకు 123 టీఎంసీల సామర్థ్యంతో కోయిల్‌కొండ –గండీడ్ లిఫ్ట్, రేలంపాడు రిజర్వాయర్ కెపాసిటీ పెంపు, ఎస్ఎల్బీసీ ఎక్స్టెన్షన్, కల్వకుర్తి ఎక్స్టెన్షన్ వంటి ప్రాజెక్టులున్నాయి.
ఇవీ ఆ 16 ప్రాజెక్టులు..
1. రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంపు.
2. గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ 1.32 టీఎంసీల నుంచి 5 లేదా 10 టీఎంసీలకు పెంపు.
3. 25 వేల ఎకరాలకు అదనపు ఆయకట్టుకు 4 టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 2.
4. పులిచింతల ఫోర్‌షోర్ నుంచి వేములూరు వాగుపై 0.5 టీఎంసీల సామర్థ్యంతో బొజ్జా తండా-భీమా తండా లిఫ్ట్ స్కీమ్. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలోని 3 గ్రామాల్లో ఉన్న 1380 ఎకరాలకు సాగు నీరందించే ప్లాన్.
5. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 2. 93,531 ఎకరాల అదనపు ఆయకట్టును సృష్టించేలా శ్రీశైలం నుంచి 13 టీఎంసీలను లిఫ్ట్ చేసేందుకు చేపట్టే ఫేజ్ 2లో కెనాల్స్, హెడ్‌వర్క్స్ పనులు. దాంతో పాటు తాగునీటి కోసం 7.12 టీఎంసీలు.
6. వరద రోజుల్లో రోజూ 2 టీఎంసీల చొప్పున వంద టీఎంసీలు తరలించేలా జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్. నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో 11.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.
7. మహబూబ్‌నగర్ జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి కోసం 123 టీఎంసీల తరలింపునకు కోయిల్‌కొండ–గండీడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. జూరాల ఆధారంగా చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా కోయిల్‌కొండ రిజర్వాయర్ 45 టీఎంసీలు, గండీడ్ రిజర్వాయర్ 35 టీఎంసీలు, దౌల్తాబాద్ రిజర్వాయర్ 43 టీఎంసీలను నిర్మించనున్నారు.
8. 3.30 టీఎంసీల నీటిని వాడుకునేలా కోయిల్‌సాగర్ లిఫ్ట్ స్కీమ్ సామర్థ్యం పెంపు. అదనంగా 13500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు.
9. మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో 11,250 ఎకరాలకు నీళ్లిచ్చేలా జయపురం వద్ద ఆకేరు నదిపై 2 టీంఎసీలతో ఆకేరు బ్యారేజ్
10. మహబూబాబాద్ జిల్లా విస్సంపల్లిలో ఆకేరు నదిపై 1.2 టీఎంసీల వినియోగానికి బ్యారేజీ నిర్మాణం. 11,799 ఎకరాలకు నీళ్లు.
11. మహబూబాబాద్ జిల్లా ఏదులపూసపల్లి వద్ద మున్నేరు నదిపై మున్నేరు బ్యారేజీ. 13201 ఎకరాలకు నీళ్లిచ్చేలా 1.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం.
12. మహబూబాబాద్ జిల్లా ముల్కనూరు వద్ద మున్నేరు నదిపై మున్నేరు బ్యారేజీ. 11,871 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు 1.2 టీఎంసీలతో బ్యారేజ్
13. మహబూబాబాద్ జిల్లా ముల్కపల్లి వద్ద 25 నుంచి 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్
14. ఖమ్మం జిల్లా ఏదులచెరువు వద్ద ఆకేరు నదిపై బ్యారేజ్. 13,129 ఎకరాలకు నీళ్లిచ్చేలా 1.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం.
15. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.99 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా 35 టీఎంసీల
వినియోగానికి ఎస్ఎల్బీసీ కెనాల్
ఎక్స్టెన్షన్. రోజూ ఒక టీఎంసీ చొప్పున తరలించేలా నిర్మాణం.
16. హైదరాబాద్ సిటీతో పాటు రీజినల్ రింగ్ రోడ్ ప్రాంతంలో తాగు నీటి అవసరాల కోసం 30 టీఎంసీల సామర్థ్యంతో మూడు రిజర్వాయర్లు. దేవులమ్మ నాగారం, దండు మైలారం, ఆరుట్లల్లో 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం.
