రాష్ట్రానికి రావాల్సిన రూ. 4 వేల 256 కోట్లు రిలీజ్ చేయండి: సీఎం రేవంత్

 రాష్ట్రానికి రావాల్సిన రూ. 4 వేల 256 కోట్లు రిలీజ్ చేయండి: సీఎం రేవంత్

ఢిల్లీలో  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. సివిల్ సప్లైశాఖకు కేంద్రం బకాయిలు పడ్డ 4 వేల 256 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి కోరారు.  ఇటు తెలంగాణలో ధాన్యం సేకరణ అంశాలను కేంద్ర మంత్రితో చర్చించారు రేవంత్ రెడ్డి.. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పాటు  ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణకు కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తుందని చెప్పారు పీయూష్ గోయల్.. త్వరలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

హైద‌రాబాద్ వ‌యా మిర్యాల‌గూడ -విజ‌య‌వాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని పీయూష్ గోయల్ ను కోరారు రేవంత్. అలాగే హైద‌రాబాద్‌- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమ‌తులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుద‌లవుతాయ‌న్నారు.

హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో  ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గ‌త ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింద‌ని, దానిని ఉప సంహ‌రించుకొని నూత‌న ప్ర‌తిపాద‌న‌లు పంపేందుకు అనుమ‌తించాల‌ని  కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.  యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్‌కు నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ (ఎన్ఐడీ) మంజూరు చేసింద‌ని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శ‌ర్మ దానికి శంకుస్థాప‌న చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గోయ‌ల్‌కు గుర్తు చేశారు