రాయదుర్గం-శంషాబాద్ మెట్రో లైన్ మరింత లేటు

రాయదుర్గం-శంషాబాద్ మెట్రో లైన్ మరింత లేటు
  • రూ.4,500 కోట్లతో ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు
  • హెచ్ఎండీఏ  రూ.350 కోట్లు ఇవ్వాలంటూ గతంలో మంత్రి కేటీఆర్ ఆదేశాలు 
  • పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో ఇప్పటికీ పూర్తికాని భూ సేకరణ
  • ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే తగ్గనున్న జర్నీ టైమ్

హైదరాబాద్, వెలుగు: రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో  కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. 2019లోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రకటించినా కానీ సరిపడా నిధుల్లేక పనులు ముందుకు సాగట్లేదు. రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్​పోర్టు వరకు ఎక్స్ ప్రెస్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ. 4 వేల 500  కోట్లతో మెట్రో సంస్థ వద్ద ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కానీ నిధుల కేటాయింపులు, చెల్లింపులు లేకపోవడంతో ఇప్పటికీ భూ సేకరణ పూర్తి కాలేదు. దీంతో ఎయిర్ పోర్టుకు జర్నీ చేసేందుకు మెట్రో ట్రైన్ సౌలతు ఇప్పట్లో వచ్చేలా లేదు. ప్రాజెక్టు పూర్తయితే 40 నిమిషాల జర్నీ... 20 నిమిషాలకు తగ్గనుంది. 
సెకండ్ ఫేజ్ లో భాగంగా..
సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ పనుల్లో భాగంగా ఎయిర్ పోర్టుకు వేగంగా, సౌకర్యవంతంగా చేరుకునేందుకు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 30 కి.మీ ఎక్స్ ప్రెస్ మెట్రో కారిడార్​ ప్రాజెక్టుకు  ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలు చేసింది. ఎయిర్ పోర్టు కారిడార్ కోసం స్పెషల్ వింగ్​ను ఏర్పాటు చేసిందే తప్ప సరిపడా నిధులు ఇవ్వలేదు. దీంతో భూ సేకరణ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. సిటిజన్లు ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు, క్యాబ్ ల్లో ఎయిర్ పోర్టుకు  అత్యవసరంగా వెళ్లాలంటే  రెండు, మూడు గంటల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి.  ఎయిర్​పోర్టు వరకు మెట్రో విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే సిటీ రవాణాలోనే అది కీలకం కానుంది.  తగ్గిన మెట్రో రెవెన్యూ,  ప్రభుత్వ నిధులు కేటాయింపులు లేక రాయదుర్గం– శంషాబాద్ ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా అందుబాటు లోకి వచ్చేలా లేదు.  
డీపీఆర్ అందించిన ఢిల్లీ మెట్రో అధికారులు
30–32 కి.మీ  పొడవైన ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో కారిడార్ నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఢిల్లీ మెట్రో  అధికారులు ఏడాది క్రితం రాయదుర్గం– శంషాబాద్ రూట్ లో పర్యటించి ప్రాజెక్టుకు సంబంధించి   డీపీఆర్ ను రూపొందించి హైదరాబాద్ మెట్రో అధికారులకు అందించారు. ఈ రూట్​లో హెచ్ఎండీఏ భూములు కూడా ఉండటంతో భూ సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం  హెచ్ఎండీఏ, మెట్రో, టీఎస్ఐఐసీని  భాగస్వామ్యం చేస్తూ స్పెషల్ పర్పస్ వెహికల్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రత్యేక వింగ్​ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ నుంచి రూ. 350 కోట్లు నిధులు ఇవ్వాలంటూ గతంలో మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కానీ భారీ అంచనాలతో రూపొందించిన ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు సమకూరితే గానీ పనులు మొదలు కావని మెట్రో వర్గాలు 
చెప్తున్నాయి. ఇప్పటికే ఫండింగ్ ఏజెన్సీలతో స్పెషల్ వింగ్ ఆధ్వర్యంలో చర్చలు జరిగినా... ఫలితం లేదని తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం కేటాయించే నిధులవే మెజార్టీ వాటా కానుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరు కాలేదని సమాచారం. 
డెవలప్​మెంట్ అంతా అటువైపే...
ఐటీ కారిడార్ నుంచి ఎయిర్ పోర్టు రూట్​లో రియల్ ఎస్టేట్​కు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే లగ్జరీ విల్లాలు, వేల మంది ఉండే అపార్టుమెంట్లకు దీటుగా హైరైజ్ బిల్డింగ్​లు ఆయా ప్రాంతాల్లో భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో రాయదుర్గంతో ఆగిపోయిన మెట్రో లైన్​ను విస్తరణ పూర్తయితే.. రవాణా సౌలతులు మరింత మెరుగుపడతాయి.  ఈ మెట్రో ప్రాజెక్టు రూట్​లో  ఓఆర్ఆర్ కు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్, కిస్మత్‌‌‌‌‌‌‌‌పురా మీదుగా  శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్ పోర్టు వరకు రద్దీ పెరగనుంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే వెహికల్స్ సంఖ్య 30–45 వేలు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కరోనా తర్వాత పబ్లిక్ ట్రాన్స్ పోర్టు తగ్గడంతో ప్రైవేటు వెహికల్స్ లోనే ఎక్కువ మంది జర్నీ చేస్తున్నారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణం పూర్తయితే సిటిజన్లు అక్కడికి  వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది.