దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి. గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేసే ఈ నేచురల్ బ్యూటీ.. ఇప్పుడు పాన్ ఇండియాలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ' రామాణయం ' ఇందులో సీతగా సాయి పల్లవి కనిపించబోతుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే అంతకంటే ముందే ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ' మేరే రహో' విడుదల కావాల్సి ఉంది. కానీ.. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పుడు ఒక సంచలన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
అమీర్ ఖాన్ కొడుకు కోసం 'మిస్టర్ పర్ఫెక్ట్' ప్లాన్!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన సాయిపల్లవి రొమాంటిక్ డ్రామా 'మేరే రహో' లో నటించింది. ఇది 2016 నాటి సూపర్ హిట్ థాయ్ సినిమా 'వన్ డే'కు అధికారిక రీమేక్. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ గతేడాది ఏప్రిల్‌లోనే పూర్తయింది. నిజానికి, ఈ సినిమాను 2025 డిసెంబర్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అనూహ్యంగా ఈ మూవీ వాయిదా పడింది.
ALSO READ : ఫుల్ యాక్షన్ మోడ్‌లో చిరు..
దీని వెనుక అమీర్ ఖాన్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రణ్ వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' ప్రభంజనం సృష్టిస్తోంది. దీనికి తోడు రాబోయే నెలల్లో 'బార్డర్ 2', 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఈ పోటీలో తన కొడుకు సినిమాను రిలీజ్ చేస్తే కలెక్షన్స్ దెబ్బతింటాయని, థియేటర్ల కొరత ఏర్పడుతుందని అమీర్ భావిస్తున్నారట. అందుకే, తన కొడుకు జునైద్‌కు ఒక సాలిడ్ హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాను జూలై 2026కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
సాయిపల్లవికి ఇది కీలక మైలురాయి
సాయిపల్లవి గతంలో 'తండేల్' వంటి సినిమాలతో మెప్పించినా, హిందీ మార్కెట్లోకి అడుగుపెట్టడం ఆమె కెరీర్‌లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఒకవేళ 'మేరే రహో' జూలైలో విడుదలైతే, ఆ వెంటనే వచ్చే దీపావళికి 'రామాయణం' కూడా రిలీజ్ కానుంది. అంటే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సాయిపల్లవి రెండు భారీ చిత్రాలతో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జునైద్ ఖాన్ ఆశలన్నీ ఈ సినిమాపైనే!
జునైద్ ఖాన్ ఇప్పటికే ఓటీటీలో ఒక ప్రయత్నం చేసినా, అది పెద్దగా ఆకట్టుకోలేదు. సాయిపల్లవి వంటి పవర్‌హౌస్ పెర్ఫార్మర్ తోడైతే తన కొడుకు కెరీర్ పుంజుకుంటుందని అమీర్ నమ్మకం. మరి ఈ 'వన్ డే' రీమేక్ సాయిపల్లవికి బాలీవుడ్‌లో ఎలాంటి గుర్తింపు తెస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ మూవీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
