MSG Trailer: ఫుల్ యాక్షన్ మోడ్‌లో చిరు.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్

MSG Trailer: ఫుల్ యాక్షన్ మోడ్‌లో చిరు.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సంక్రాంతి బరిలోకి వస్తున్నారు. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనవరి 11న ప్రీమియర్స్ పడనున్నాయి.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్స్‌ను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. వరుసగా ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు, సాంగ్ అప్డేట్స్, క్రేజీ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై హైప్‌ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు కావాల్సిన అసలైన ఘట్టాన్ని చూపించడానికి అనిల్ సిద్ధమయ్యారు.. 

 

లేటెస్ట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జనవరి 4, ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చిరంజీవి ఫుల్ యాక్షన్ మోడ్‌లో దర్శనమిచ్చారు. మోకాలిపై కూర్చొని తుపాకీ పేలుస్తున్న స్టిల్‌ అభిమానుల్లో విజిల్స్ వేయించేలా ఉంది. పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇకపోతే, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్, మీసాల పిల్ల, శశిరేఖ సాంగ్స్ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. మీసాల పిల్ల పాట యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులు నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలో చిరంజీవి-నయనతార మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. చిరు గ్రేస్, సిగ్నేచర్ డాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, ఇటీవలే వచ్చిన చిరు- వెంకీల మెగా మాస్ సాంగ్ సైతం యూట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. 

సంక్రాంతి రిలీజ్ సినిమాల్లో..‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు వచ్చిన విజులవ్స్ అన్నీ సెట్ అయ్యాయి. ఇక మెగాస్టార్ మ్యానరిజమ్స్, అనిల్ రావిపూడి హిలేరియస్ కామెడీ మిక్స్ అయితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇందులో వెంకటేష్ కూడా కీలక పాత్రలో ఉండటంతో మెగా, వెంకీ అభిమానులు ఈ చిత్రం కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్‌‌‌‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.