టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఊహించని నిరాశ ఎదురైంది. భారీ అంచనాల మధ్య , పీరియడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన 'కింగ్ డమ్' ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో .. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన 'కింగ్‌డమ్'
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ 'కింగ్‌డమ్' మూవీని సుమారు రూ. 130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ ఏడాది జూలైలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 82.05 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని స్పై అవతారంలో చూపించినప్పటికీ, కథనంలో వేగం లోపించడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో మెరిశారు.
సీక్వెల్‌కు చెక్ పెట్టిన నాగవంశీ
నిజానికి 'కింగ్‌డమ్' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే మొదటి భాగానికి వచ్చిన నెగటివ్ టాక్ , నష్టాల దృష్ట్యా, 'కింగ్‌డమ్-2' ను పక్కన పెట్టినట్లు నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతానికి కింగ్‌డమ్ సీక్వెల్ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ గౌతమ్ తిన్ననూరితో తమ బ్యానర్‌లోనే మరో సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం గౌతమ్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు, ఆ తర్వాత మా కాంబినేషన్ మూవీ పట్టాలెక్కుతుంది అని తెలిపారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ 'కింగ్‌డమ్-2' పై పెట్టుకున్న ఆశలన్నీ అటకెక్కినట్లయ్యింది.
'రౌడీ జనార్ధన'పైనే భారీ ఆశలు
'కింగ్‌డమ్' నిరాశపరిచినప్పటికీ, విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం 'రౌడీ జనార్ధన' (Rowdy Janardhana) తో బాక్సాఫీస్ వద్ద గర్జిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్ ఇటీవల విడుదలై యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఇందులో విజయ్ మునుపెన్నడూ లేని విధంగా రక్తంతో తడిసిన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు, 'టాక్సీవాలా' వంటి హిట్‌ను అందించిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో VD14 చిత్రానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది పీరియడ్ డ్రామాగా ఉండబోతున్నట్లు సమాచారం. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు 'రౌడీ జనార్ధన' , 'VD14' చిత్రాలు తిరిగి పూర్వ వైభవాన్ని తెస్తాయని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు..
