తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలకు మంచి స్పందన వస్తోందని తెలిపింది టీటీడీ.డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటుతో మరింత ప్రజాదరణ లభిస్తోందని తెలిపింది టీటీడీ. శ్రీవారి ధర్మ రథాల ద్వారా రోజుకు 60 వేల మంది భక్తులు ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు తెలిపింది టీటీడీ. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచిచూసే సమయం తగ్గి, ఉచిత బస్సు సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారని పేర్కొంది టీటీడీ.
ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఈ సేవలో ఉన్నాయని... రోజుకు సగటున 300 ట్రిప్పులు నిర్వహిస్తూ, ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోందని తెలిపింది టీటీడీ. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సు సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోందని తెలిపింది టీటీడీ.
రోజుకు 60 వేల మంది భక్తులు సురక్షితంగా ప్రయాణం
బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియజేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని... రోజుకు సుమారు 60 వేల మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని తెలిపింది టీటీడీ.
తగ్గిన ప్రైవేట్ ట్యాక్సీల ప్రయాణం:
గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారని... దీంతో ట్యాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారని తెలిపింది. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్ లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకుగాను హైదరాబాద్ కు చెందిన బి.ఎస్.టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోందని తెలిపింది టీటీడీ.
►ALSO READ | తిరుమలలో వసతి గదుల బుకింగ్ స్కాం... టీటీడీ కీలక సూచన
ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారని... భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ విధానం ఎంతో ఉపయోగరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపింది.
భక్తుల కోసం రాత్రుల్లో అదనంగా 20 ట్రిప్పులు
ప్రస్తుతం రాత్రి 9 నుండి ఉదయం 5 ఐదు గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా.. భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచనున్నట్లు తెలిపింది టీటీడీ. అదే విధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది టీటీడీ.
