ఎగ్ టెండర్ల రూల్స్ మార్చండి .. ప్రభుత్వంపై పౌల్ట్రీ వ్యాపారులు, కాంట్రాక్టర్ల ఒత్తిడి

ఎగ్ టెండర్ల రూల్స్ మార్చండి .. ప్రభుత్వంపై పౌల్ట్రీ వ్యాపారులు, కాంట్రాక్టర్ల ఒత్తిడి
  • అర్హత లేకున్నా కాంట్రాక్టులు ద‌‌క్కించుకునే ఎత్తుగ‌‌డ‌‌లు
  • అర్హత, అనుభవం, టర్నోవర్‌‌‌‌లాంటి నిబంధనలు సడలించాలని డిమాండ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌‌వాడీలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్‌‌లో గుడ్ల సరఫరా కాంట్రాక్టుల కోసం పెట్టిన  నిబంధనలు మార్చాలని పౌల్ట్రీ వ్యాపారులు, కాంట్రాక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అర్హత లేకున్నా కాంట్రాక్టులు ద‌‌క్కించుకునేందుకు ఎత్తుగ‌‌డ‌‌లు వేస్తున్నారు. ఈ నెల 5న గుడ్ల సరఫరాకు గైడ్‌‌లైన్స్‌‌ను ఖరారు చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల ఒకటి కల్లా టెండర్లు ఫైనల్ చేయాలని ఉత్తర్వుల్లో  స్పష్టం చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలవగా, ఇకపై జిల్లాస్థాయిలో  పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టర్లు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన డీపీసీ (డిస్ట్రిక్​ పర్చేస్ కమిటీ)లో అడిషనల్ కలెక్టర్‌‌‌‌తో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

టెండర్ రూల్స్ ఇవీ..

గతంలో టెండర్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేయడం వల్ల జిల్లాలకు చిన్న సైజు, నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం జిల్లాలవారీగా టెండర్లు పిలవాలని, కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది.  నిబంధనల్లోనూ మార్పులు చేసింది. టెండర్‌‌‌‌లో పాల్గొనేవారు తెలంగాణ పౌల్ట్రీ రైతు అయ్యి ఉండాల‌‌ని, కనీసం రూ.5 కోట్ల ట‌‌ర్నోవ‌‌ర్ ఉండాల‌‌ని పేర్కొంది. గ‌‌తంలో అంగ‌‌న్‌‌వాడీలు, లేదంటే ప్రభుత్వ హ‌‌స్టళ్లకు కోడి గుడ్ల స‌‌ర‌‌ఫ‌‌రా చేసిన అనుభం ఉండాలని, మూడేండ్ల కాలంలో ఏదైనా ఒక ఏడాది రూ.5 కోట్ల విలువైన గుడ్లను స‌‌ర‌‌ఫ‌‌రా చేసి ఉండాలనే  రూల్స్ పెట్టింది. టెండ‌‌ర్లలో పేర్కొన్న విధంగా అగ్‌‌మార్క్​, రిప్లికా, అనుభ‌‌వం, ట‌‌ర్నోవర్​లాంటి ష‌‌ర‌‌తుల‌‌ను విధించగా,  కొంద‌‌రు  పౌల్ట్రీ యజమానులు, కాంట్రాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు.  

10 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాల్సిన ఈ తరుణంలో  టెండ‌‌ర్లను అడ్డుకునేందుకు కొంద‌‌రు ప్రయ‌‌త్నిస్తున్నట్లు సమాచారం. గతంలో హైకోర్టు మొట్టి కాయ‌‌లు వేసినా ప‌‌ట్టించుకోకుండా... కొత్త టెండ‌‌ర్లలో పేర్కొన్న అనుభ‌‌వం, ట‌‌ర్నోవ‌‌ర్‌‌‌‌లాంటి నిబంధ‌‌ల‌‌ను ఎత్తేయాల‌‌ని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు.  పౌల్ట్రీ వ్యాపారులు,  కాంట్రాక్టర్లు కోరిన‌‌ట్లు నిబంధ‌‌న‌‌ల‌‌ను స‌‌డ‌‌లిస్తే.. క‌‌థ మ‌‌ళ్లీ మొద‌‌టికి వ‌‌స్తుంద‌‌ని అధికారులు అంటున్నారు. అనుభవం, ట‌‌ర్నోవ‌‌ర్‌‌‌‌లాంటి నిబంధనలు లేకుండా మ‌‌రోసారి టెండ‌‌ర్లు పిలిస్తే కోర్టుల్లో చిక్కులు త‌‌ప్పవ‌‌ని  చెబుతున్నారు.