నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. 3.35 టన్నుల నకిలీ విత్తనాలు స్వాధీనం

నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. 3.35 టన్నుల నకిలీ విత్తనాలు స్వాధీనం

నకిలీ విత్తనాల విక్రయిస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు.  తాజాగా మేడ్చల్ , రాజేంద్ర నగర్, చేవేళ్లలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు షాపులపై కేసు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. 3.35 టన్నుల నకిలీ బీటీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 

గుజరాత్ కు చెందిన కమలేష్ పాటిల్ నకిలీ విత్తనాలు మేడ్చల్ రైల్వే స్టేషన్ వద్ద ఓ గోదాం లో డంప్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ గోదాం లో భద్రపరిచిన నకిలీ విత్తనాలను రైతులకు అమ్మాలని నిర్మల్ జిల్లాకు చెందిన అబ్దుల్ రజాక్  ప్లాన్ చేసినట్లు చెప్పారు. 
దీనిపై సమాచారం అందడంతో మేడ్చల్ SOT పోలీసులు రైడ్ చేసి నకిలీ విత్తనాలను  స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 

మరో కేసులో భాగంగా రాజేంద్రనగర్లో 800 కేజీల నకిలీ BT/HT పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నంద్యాల కు చెందిన బాష అలియాస్ అలీషాను అరెస్ట్ చేశామన్నారు.  బాషా గౌతమీ సీడ్స్ లో పనిచేస్తున్నాడని..అతను జర్మినేషన్ బెస్ట్ ఫెయిల్ అయిన విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అయితే ఆ విత్తనాలను నాశనం చేయాలని..కానీ బాష ఆ విత్తనాలను తక్కువ ధరకు   రైతులకు అంటగడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 

చేవెళ్లలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వికారాబాద్ కు చెందిన మల్లయ్య ఫెర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్నాడని..ఈ షాప్ లో పల్లవి సీడ్స్ పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు  విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.