బిపర్జోయ్ తుఫాను తీవ్రరూపం..ఐఎండీ హెచ్చరిక

బిపర్జోయ్ తుఫాను  తీవ్రరూపం..ఐఎండీ హెచ్చరిక

బిపర్జోయ్ తుపాను మరింత  తీవ్రరూపం దాల్చనుందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 24 గంటల్లో బిపార్జోయ్ తుపాను మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం బిపర్జోయ్ తుపాను  గోవాకు పశ్చిమాన 690 కిలో మీటర్లు, ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 640 కిలో మీటర్లు..,పోర్‌బందర్‌కు నైరుతి దిశలో 640 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ తుపాను కారణంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో  కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

బీచ్ మూసివేత..

బిపర్జోయ్ తుపాను కారణంగా గుజరాత్ తీరంలోని వల్సాద్ లోని తిథాల్ బీచ్ వద్ద అలలు భారీగా ఎగిసిప‌డుతున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వల్సాద్ అధికారులు ముందుజాగ్రత్త చర్యగా టిథాల్ బీచ్ ను  మూసివేశారు. స‌ముద్రంలో ఉన్న  మత్స్యకారులు వెనక్కు రావాలని ప్రకటించారు. అరేబియా సముద్రంలో జూన్‌ 14 వరకు చేపల వేటను నిలిపేయాలని మత్స్యకారులకు సూచించింది.
 
మ‌రికొన్ని గంటల్లో బిపర్జోయ్ తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్ర సహా తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలోనే  కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

పేరు ఎలా వచ్చింది..

ఈ తుపానుకు బంగ్లాదేశ్ బిపార్జోయ్ అని పేరు పెట్టింది. ఈ పేరు బెంగాలీలో “విపత్తు”  అని అర్ధం. అరేబియా సముద్రం, బంగాళాఖాతంతో సహా ఉత్తర హిందూ మహాసముద్రంపై ఏర్పడే అన్ని ఉష్ణమండల తుపానులకు ప్రపంచ వాతావరణ సంస్థ పేరు పెడుతుంది. అయితే ఈ పేరును   2020లో  ప్రపంచ వాతావరణ సంస్థ   స్వీకరించింది.